Tirumala : నేడు కూడా తిరుమలలో భక్తుల రద్దీ నిల్... నేరుగా దర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా తక్కువగానే ఉంది. నేరుగా దర్శనం చేసుకునే అవకాశం ఉంది;
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా తక్కువగానే ఉంది. నేరుగా దర్శనం చేసుకునే అవకాశం ఉంది సోమవారం కావడంతో భక్తుల సంఖ్య తక్కువగా ఉంది. ఇన్ని రోజులు భక్తులతో కిటకిటలాడిన తిరుమల కొండ గత రెండు రోజుల నుంచి భక్తుల లేక వీధులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మొన్నటి వరకూ దసరా పండగ సెలవులతో పాటు బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతుండటంతో లక్షలాది మంది భక్తులు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కానీ ఇప్పుడు సెలవులు పూర్తి కావడంతో రద్దీ తక్కువగా ఉంది. దీంతో పాటు తుపానుల హెచ్చరికలతో భక్తుల సంఖ్య తక్కువగా ఉంది. తిరుమలకు వెళ్లి చిక్కుకుపోతామోమోనని కొందరు తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటుండగా, మరికొందరు రద్దు చేసుకుంటున్నారు. మరో తుపాను పొంచి ఉండటంతో భక్తులు సంఖ్య తగ్గిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
అన్ని కంపార్ట్‌మెంట్లలో...
భారీ వర్షం కురిస్తే తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడం కష్టంగా మారుతుందని భావించి భక్తులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో తిరుమల వీధులన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. నేరుగానే స్వామివారిని దర్శించుకునే అవకాశముందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉండకుండానే స్వామి వారి దర్శనం చేసుకుంటున్నారు. ఉచిత దర్శనానికి కేవలం ఆరు గంటల సమయం మాత్రమే పడుతుందని అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనానికి మూడు గంటలు, మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం గంట నుంచి రెండు గంటల్లో పూర్తవుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 73,926 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,726 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.87 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.