Cyclone Michoung : ఎంతమందిని మింగేస్తుందో.. మాయదారి మిచౌంగ్
మిచౌంగ్ తుఫాను బీభత్సం సృష్టిస్తుంది. మరికొద్ది గంటల్లో తీరం దాటుతుండటంతో తన ప్రభావాన్ని చూపుతుంది
మిచౌంగ్ తుఫాను బీభత్సం సృష్టిస్తుంది. మరికొద్ది గంటల్లో తీరం దాటుతుండటంతో తన ప్రభావాన్ని చూపుతుంది. బలమైన గాలులు వీస్తున్నాయి. గంటకు వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయాని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు ఎవరూ అత్యవసరమయితే తప్ప బయటకు రావద్దని సూచించింది. ఇప్పటికే పలు చోట్ల భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. విద్యుత్తు స్థంభాలు నేలకొరగాయి. అనేక చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.
మూడు జిల్లాల్లో...
ప్రధానంగా చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. తిరుపతి జిల్లా చిట్టేడులో 39 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది మరో ఇరవై నాలుగు గంటల పాటు ప్రజలు అప్రమత్తంగానే ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్ సెంటర్ లో ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్థంభాలు నేలకొరిగాయి. అదృష్టవశాత్తూ ప్రజలు ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అందుకే తుఫాను తీరం దాటే సమయంలో ఎవరూ ఇంటిని విడిచి బయటకు రావద్దని అధికారులు గట్టిగా కోరుతున్నారు.
పంట నష్టం....
మరోవైపు సముద్రం వద్ద పెద్దయెత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దయెత్తున పంట నష్టం జరిగిందని అంచనాలు వినపడుతున్నాయి. ప్రధానంగా పచ్చి మిర్చి, పొగాకు వంటి పంటలు నీటమునగడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. కృష్ణా జిల్లా దివిసీమ ప్రాంతంలో పంటలకు ఎక్కువ నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాధమికంగా అంచనాకు వచ్చారు. మిర్చి పంట కూడా దెబ్బతినింది. దీంతో తమకు సాయం అందించాలని రైతులు కోరుతున్నారు.