Cyclone Michoung :తుఫాను కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది

మిచౌంగ్ తుఫాను భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఎవరికీ రాత్రంతా కంటి మీద కునుకు కూడా లేదు.

Update: 2023-12-05 02:49 GMT

మిచౌంగ్ తుఫాను భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఎవరికీ రాత్రంతా కంటి మీద కునుకు కూడా లేదు. భారీ వర్షం. ఈరోజు నెల్లూరు - మచిలీపట్నంల మధ్య తీరం దాటే అవకాశముందన్న హెచ్చరికలతో తీర ప్రాంత వాసులు గుండెలు చేతులో పట్టుకుని బతుకుతున్నారు. మచిలీపట్నంలో ఇప్పటికే ఏడో నెంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మత్స్యకారులను చేపల వేటకు వెళ్లొద్దని ఇప్పటికే నిషేధించారు. అనేక తీర ప్రాంతాల్లో పర్యాటకులను కూడా సముద్రం వైపు రానివ్వడం లేదు.

కుండపోత వర్షం...
అనేక చోట్ల భారీ వర్షం కురుస్తుండటంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇప్పటికే ఇళ్లను వదిలి పెట్టి పునరావాస కేంద్రాలకు చేరుకున్న బాధితులు తమ ఆస్తులు ఏమయి పోతాయోనన్న దిగులు పట్టుకుంది. మిచౌంగ్ తుఫాను ప్రభావంతో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్ల వర్షం కురుస్తుందని తెలిసింది
భయం.. భయంగా....
కృష్ణపట్నం పోర్టులో పదో నెంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇప్పటికే వాగులు, వంగులు పొంగి పొరలుతుండటంతో జనజీవనం స్థంభించి పోయింది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలుచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకురావడంతో ఎప్పుడు ఏం జరుగుుతందోనన్న భయం ప్రజలను పట్టుకుంది. ఆకస్మిక వరదలు తలెత్తే అవకాశముండంటంతో సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దన్న హెచ్చరికలు వస్తున్నాయి.


Tags:    

Similar News