బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీ పై ప్రభావం ?

వాయుగుండం పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ శ్రీలంక మీదుగా కొమరిన్ ప్రాంతం వైపు పయనించే అవకాశం..

Update: 2022-12-22 05:47 GMT

ap weather update

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తీవ్ర అల్పపీడనంగా మారి.. గురువారం (డిసెంబర్22) నాటికి వాయుగుండంగా మారినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ వాయుగుండం పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ శ్రీలంక మీదుగా కొమరిన్ ప్రాంతం వైపు పయనించే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. వాయుగుండం కారణంగా రానున్న మూడు రోజుల్లో తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ వాయుగుండానికి ఏపీవాసులు భయపడవద్దని, నామమాత్రంగానే ప్రభావం ఉంటుందని పేర్కొంది.

ఈ నెల 24 నుంచి దక్షిణ కోస్తాంద్ర, రాయలసీమలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఉత్తర కోస్తాంద్రలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే వాయుగుండం ప్రభావంతో ఏపీ అంతటా.. ఈశాన్య, ఆగ్నేయ గాలులు వీస్తుండటంతో.. చలి తీవ్రత పెరుగుతుందని తెలిపింది. అలాగే ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు కమ్మేస్తుందని వివరించింది. వాహన దారులు ఈ విషయాన్ని గమనించి.. జాగ్రత్తగా ఉండాలని సూచించింది.





Tags:    

Similar News