Pawan Kalyan : పరిపాలనలో నాకు చంద్రబాబు స్ఫూర్తి
గత ప్రభుత్వం పంచాయతీలను నీరు గార్చిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. . కంకిపాడులో జరిగిన పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు
గత ప్రభుత్వం పంచాయతీలను నీరు గార్చిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీలకు నిధులు పెద్దయెత్తున ఇస్తున్నామని తెలిపారు. కంకిపాడులో జరిగిన పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తమ ప్రభుత్వం పారదర్శకతతో పాలన అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం పంచాయతీ రాజ్ నిధులు ఖర్చు చేయకుండా పక్కదారి పట్టించిందన్నారు. గత ప్రభుత్వ హాయాంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎవరో కూడా తనకు తెలియదన్నారు. గ్రామ సభల్లో తీసుకున్న నిర్ణయాలు అమలు చేయడం అంత తేలిక కాదని అన్నారు. అయినా చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని తెలిపారు.
ఇది మంచి ప్రభుత్వం...
తనకు పాలన ఎలా చేయాలో స్ఫూర్తి చంద్రబాబు నాయుడు అని పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన నిజాయితీగా అందించే పాలన తనకు స్ఫూర్తి నిచ్చిందన్నారు. ఏ అధికారి అయినా తప్పులు చేస్తే సహించే ప్రశ్నే లేదని తెలిపారు. తమ పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఒక డీఎఫ్‌ఓపై తాను విచారణకు ఆదేశించానని పవన్ కల్యాణ్ తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఏడాదికి పది వేల కోట్ల రూపాయల నిధులు విడుదలవుతాయని తెలిపారు. వాటిని సద్వినియోగం చేసుకుంటే పల్లెల్లన్నీ అభివృద్ధి చెందుతాయని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో 30 వేల పనులను ఈరోజు శంకుస్థాపనలు చేస్తున్నామని తెలిపారు. ఇది లంచాల ప్రభుత్వం కాదని, మంచి ప్రభుత్వమని పవన్ కల్యాణ్ అని అన్నారు. కంకిపాడు నుంచి ఉయ్యూరు వరకూ రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.