చేతులు కలిపిన దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు
ఎన్నికలు వచ్చాయంటే చాలు.. టికెట్ దక్కించుకోవడం పక్కన పెడితే.. గ్రూపులన్నిటినీ కలుపుకుని వెళ్లడం
ఎన్నికలు వచ్చాయంటే చాలు.. టికెట్ దక్కించుకోవడం పక్కన పెడితే.. గ్రూపులన్నిటినీ కలుపుకుని వెళ్లడం చాలా కష్టం. ఎంతో మంది నేతలు గ్రూపు రాజకీయాల కారణంగా ఓటమిని మూటగట్టుకుంటూ ఉంటారు. కలుపుకుని వెళ్ళడానికి దారులు వెతక్కుండా.. అధిష్టానం సీటు ఇచ్చింది.. ఓట్లు గుద్దేస్తారని అనుకుంటే మాత్రం వరుస షాక్ లు ఎదురవ్వక తప్పదు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల హీట్ మొదలవ్వడంతో ఆయా నేతలు కలిసి పని చేస్తే బెటర్ అని అనుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం-జనసేన పార్టీ నేతల్లో ఓ రకమైన ఆందోళన నెలకొంది. ఎలాగైనా వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించాలని అధికారంలోకి రావాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అందులో భాగంగానే విభేదాలను మరచి.. ఒక్కటైపోవాలని పలువురు నేతలు భావిస్తూ ఉన్నారు.
తాజాగా అలాంటి ఓ కలయిక.. ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో చోటు చేసుకుంది. మైలవరం నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు ఎక్కువే అని ఆ ప్రాంతంలోని ఏ పార్టీ నాయకుడిని అడిగినా చెప్పేస్తారు. టీడీపీలో అగ్రనేతగా కొనసాగుతున్న దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం నియోజకవర్గానికి చెందిన వారే.. ఆయన కూడా ఈ గ్రూపు రాజకీయాలను కట్టడి చేయలేకపోతున్నారు. దేవినేని ఉమా వర్గంతో.. బొమ్మసాని సుబ్బారావు వర్గం సై అంటే సై అన్నట్లుగా సాగుతూ ఉంటుంది. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా టీడీపీలోకి రావడంతో మైలవరం రాజకీయం ఊహించని మలుపు తిరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మైలవరంలో కలిసి పనిచేస్తామని దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు ప్రకటించారు. లోకేశ్ పాల్గొనే శంఖారావం సభను విజయవంతం చేసేందుకు కృషి చేస్తామని ఇద్దరూ కలిసి ప్రకటన చేయడంతో టీడీపీ క్యాడర్ లో జోష్ కనిపిస్తూ ఉంది. బాబు ష్యూరిటీ భవిష్యత్ కు గ్యారెంటీ సభలోనూ కలిసి పాల్గొంటామని స్పష్టం చేశారు.