తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 27 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 27 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. తిరుమల శ్రీవారిని 75,227 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం శ్రీవారి హుండీ ఆదాయం 3.85 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 33,706 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
ఇవాళ ఏడో మైలు వద్ద మహా శాంతి యాగం నిర్వహిస్తున్న టీటీడీ. గత రెండు నెలలుగా తిరుమల ఘాట్ రోడ్డులో జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాల నివారణకు టీటీడీ ఈ యాగం చేపట్టనుంది. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకూ అపమృత్యు దోష నివారణ మహా శాంతి యాగం నిర్వహించేందుకు టీటీడీ నిర్ణయించింది. తిరుమల ఘాట్ రోడ్లలో ఇటీవల వరుస ప్రమాదాలు జరగటం భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ ప్రమాదాలన్నీ మొదటి ఘాట్ రోడ్‌లోనే జరిగాయి. మొదటి ఘాట్ రోడ్‌లోని 7వ మైలు వద్ద ప్రసన్నఆంజనేయస్వామి ఆలయంలో మహాశాంతి హోమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. స్వామివారి అనుగ్రహం కోసం ఘాట్ రోడ్డులో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు టీటీడీ యాగం నిర్వహిస్తోంది.