Free Bus For Women in AP : ఏపీలో ఉచిత బస్సు ఇంత భారమా? అందుకే ఆలస్యమా?

ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంత సులువు కాదు. ప్రభుత్వానికి మరింత భారంగా మారుతుందని లెక్కలు చెబుతున్నాయి

Update: 2024-12-24 04:27 GMT

ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంత సులువు కాదు. ప్రభుత్వానికి మరింత భారంగా మారుతుందని లెక్కలు చెబుతున్నాయి. గత ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సూపర్ సిక్స్ హామీల అమలులో బాగంగా సంక్రాంతి నుంచి ఈ పథకాన్ని అమలు చేయదలచుకున్నారు. అందుకోసం కసరత్తులు కూడా ప్రారంభించారు. అయితే లెక్కలు చూస్తే మాత్రం ప్రభుత్వానికి చెమటలు పడుతున్నాయి. ఒక్కసారి ప్రభుత్వం పై ఇంత భారం పడితే తట్టుకోవడం కష్టమేనని అధికార వర్గాలు వెల్లడించాయని తెలిసింది. వేల కోల్ల రూపాయలు అవసరమని కూడా అభిప్రాయపడుతున్నారు.

పథకం ప్రవేశపెట్టాలంటే...
ఏపీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని మొదలుపెట్టాలంటే ముందుగా రాష్ట్రంలో రెండు వేల బస్సులను కొనుగోలు చేయాలి. ఇందుకోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. బస్సులు అందుబాటులోకి వచ్చినా అదనపు సిబ్బందిని కూడా నియమించాల్సి ఉంటుంది. అలాగే ఇప్పటి వరకూ వస్తున్న ఆర్టీసీ రాబడి కూడా ఉచిత బస్సు ప్రయాణం వల్ల తగ్గిపోతుంది. ఈనేపథ్యంలో వీటి సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మంత్రులతో కూడిన కమిటీని నియమించింది. ఈ కమిటీ తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అధ్యయనం చేసి నివేదికలను అందించాల్సి ఉంటుంది. ఆ నివేదికను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం విషయంలో ముందుకు వెళ్లనుందని అధికారిక వర్గాలు తెలిపాయి.
సమగ్రమైన నివేదిక...
ఇదే సమయంలో ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులు ఆ యా రాష్ట్రాల్లో పర్యటించి అవసరమైన నిధులు, బస్సుల గురించి సమగ్రమైన నివేదికను కూడా ఇచ్చారు. రెండువేల అదనపు బస్సులను కొనుగోలు చేయాలని సూచించింది. దాదాపు 11,500 మంది అదనపు సిబ్బందిని నియమించుకోవాల్సి ఉంటుందని కూడా తెలిపింది. ఆక్యుపెన్సీ రేటు పెరిగినా ఆదాయం మాత్రం పెరిగే అవకాశం లేదని చెప్పింది. అదే సమయంలో ఆర్టీసీ సిబ్బందికి నెలకు మూడువందల కోట్ల రూపాయలు జీతాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికి రోజుకు ఆర్టీసీకి పదహారు నుంచి పదిహేడు కోట్ల రాబడి వస్తుంది. అందులో మహిళలనుంచి వచ్చే ఆరుకోట్ల రూపాయలు ఈ పథకం వల్ల రాకుండా పోతాయి.
ఈ సర్వీసుల్లో...
అది కూడా నష్టమే. వీటన్నింటినీ భరించి ముందుకు పోవాల్సి ఉంటుంది. పల్లె వెలుగు, మెట్రో సర్వీస్, విజయవాడ, విశాఖపట్నం సిటీబస్సుల్లో ఈ ఉచిత బస్సు అమలు చేసినా భారీ నష్టం తప్పదని అధికారులు అంచనా వేయడంతో ప్రభుత్వం మంత్రుల కమిటీనివేదిక కోసం వెయిట్ చేస్తుంది. సంక్రాంతికి పథకం ప్రవేశపెట్టాలంటే రెండు వేల బస్సులనుకొనుగోలు చేయాలి. అదనపు సిబ్బందిని వెంటనే నియమించాలి. లేకుంటే అనవసరసమస్యలు ఎదురవుతాయి. అందుకే ఈ పథకం అమలుకు కొంత బ్రేకులు పడినట్లే కనిపస్తుంది. అయితే సూపర్ సిక్స్ హామీ కావడంతో చంద్రబాబు ఈ పథకాన్ని అమలుచేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. మరి ఏంజరుగుతుందో?



ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now

 


Tags:    

Similar News