TDP : టీడీపీలో అసంతృప్తి బయలుదేరిందా? హైకమాండ్ మారలేదంటున్న తమ్ముళ్లు

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నేతల్లో అసంతృప్తి బయలుదేరింది. చేరికలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి

Update: 2024-08-31 08:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నేతల్లో అసంతృప్తి బయలుదేరింది. శాసనసభలో అవసరమైన బలం ఉన్నప్పటికీ ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు పార్టీ కండువాలు కప్పడంపై నియోజకవర్గాల నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఎమ్మెల్యేలు కూడా చేరికలకు సుముఖంగా లేరు. అయినా వారిలో కొందరు బయటపడుతున్నా మరికొందరు మాత్రం నేరుగానే తమ మనసులో మాటను చెబుతున్నారు. ఏపీలో ఎమ్మెల్సీలను, రాజ్యసభ సభ్యులను పార్టీలో చేర్చుకుంటున్నారు. వారిని చేర్చుకుంటే పార్టీ బలోపేతం అవ్వడమేమో కాని, నియోజకవర్గాల్లో వర్గాలు మరింతగా పెరుగుతాయన్న ఆవేదన నేతల్లో వ్యక్తమవుతుంది.

క్లారిటీ ఇచ్చినా...
పార్టీ అధినేత చంద్రబాబు చేరికలపై క్లారిటీ ఇచ్చారు. పదవులకు రాజీనామా చేసి వస్తే వారి క్యారెక్టర్ చూసి చేర్చుకుంటామని చెప్పారు. అయితే అధికారంలో ఉన్న పార్టీలకు చేరే నేతలను ఎలా చేర్చుకుంటారన్న ప్రశ్న తలెత్తుతుంది. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు జెండాను వదిలేసిన నేతలకు ఎందుకు రెడ్ కార్పెట్ పలకడం అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. బీద మస్తాన్ రావు రాజ్యసభ పదవి కోసం నాడు ఫ్యాన్ పార్టీ పంచన చేరితే నేడు అదే నేతను తిరిగి పార్టీలోకి చేర్చుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఎమ్మెల్సీ బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీలు కూడా ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసి పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.
చేరికపై అభ్యంతరాలు...
ఇప్పటికే పోతుల సునీత పార్టీలోకి చేర్చుకోవడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. శాసనమండలి, రాజ్యసభలో బలం పెంచుకోవడానికి టీడీపీ ప్రయత్నం చేస్తుందని, అందులో భాగంగానే వారిని రాజీనామాలు చేసిన తర్వాత చేర్చుకుంటున్నామని హైకమాండ్ వివరణ ఇస్తున్నప్పటికీ నేతలు తృప్తి చెందడం లేదు. వారికి ఇచ్చిన హామీలేంటి? వారి రాజకీయ భవిష్యత్ కు ఎలాంటి ప్రామిస్ లు చేశారో తెలియక నేతలు కొంత టెన్షన్ పడుతున్నారు. అయితే పోతుల సునీత చేరికపై పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష నేరుగా స్పందిచారు. అధికారాన్ని కోల్పోయిన తర్వాత పార్టీని వీడి, చంద్రబాబును విమర్శించిన సునీతకు మళ్లీ పార్టీలో ఎలా చోటు కల్పిస్తారని ప్రశ్నించారు.
ఇచ్చిన హామీలు ఏంటి?
మరోవైపు సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అయితే పార్టీలోకి ఎవరు వచ్చినా పదవులు రావని, గత ఎన్నికల్లో త్యాగాలు చేసిన వారు, సీనియర్ నేతలు ఎందరో పదవుల కోసం వేచి చూస్తున్నారని, కొత్తగా చేరిన వారికి పదవులను హైకమాండ్ ఇవ్వబోదని చెప్పారు. కానీ పార్టీలో చేరిక సందర్భంగా కొందరికి ఎమ్మెల్సీ పదవులు, మరికొందరికి నామినేటెడ్ పదవులు, మరికొందరికి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ టిక్కెట్ ఇస్తామని పార్టీ హైకమాండ్ హామీ ఇచ్చిందన్న ప్రచారంతో నేతల్లో కలవరం బయలుదేరింది. కేసులు పెట్టించుకుని ఐదేళ్లు కష్టపడిన తమను కాదని, కొత్తగా కండువా కప్పుకున్న వాళ్లకు ప్రాధాన్యత ఏమిటన్న ప్రశ్న సైకిల్ పార్టీలో బాగా వినపడుతుంది.


Tags:    

Similar News