Andhra Pradesh : గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూపించరా? నాటి చంద్రబాబు పాలనలా లేదా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శాంతిభద్రతలకు మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు

Update: 2024-07-20 11:28 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శాంతిభద్రతలకు మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆయన పథ్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఎప్పుడూ ఇలా లా అండ్ ఆర్డర్ అదుపు తప్పలేదు. ఎంపీలను, ఎమ్మెల్యేలను తమ నియోజకవర్గాలకు వెళ్లకుండా అడ్డుకోవడం, ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలను హత్యలు జరగడం వంటి ఘటనలు గతంలో ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే చంద్రబాబు సంక్షేమ పథకాల విషయాల్లో ఎలా ఉన్నప్పటికీ లా అండ్ ఆర్డర్ విషయంలో ఆయన స్ట్రిక్ట్ గా ఉంటారని గత పాలనను చూసిన వారికి ఎవరికైనా ఇలాగే తెలుస్తుంది. ఎందుకంటే ఒక అత్యాచారం జరిగినా, హత్యజరిగినా వెంటనే ఆయన నేరుగా స్పందించేవారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో మతపరమైన ఘర్షణలు జరగకుండా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు ఎవరూ మరువలేరు. ఒకరకంగా హైదరాబాద్ లో కర్ఫ్యూ లేని నగరంగా మార్చడంలో ఆయన చేసిన కృషిని కూడా ఎవరూ కాదనలేరు. ఇక రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విజయవాడ, విశాఖపట్నం, రాయలసీమ వంటి ప్రాంతాల్లో రౌడీషీటర్లను ఏరిపారేశారు. సీమలో ఫ్యాక్షన్ ను రూపమాపడానికి ప్రత్యర్థి కుటుంబాలను కూడా చంద్రబాబు ఏకం చేశారు. ఇలా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే గుండెల మీద చేయి వేసుకుని హాయిగా నిద్రపోవచ్చని నమ్మేవారు అనేక మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు.
ఎన్నికల ప్రచారంలోనూ....
ఎన్నికల ప్రచారంలోనూ రౌడీషీటర్లను తాను అధికారంలోకి వచ్చిన వెంటనే తరిమేస్తానని చెప్పారు. మహిళలపై అత్యాచారం చేేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు కూడా. అయితే గత ప్రభుత్వంలో టీడీపీ నేతలపై అప్పటి వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో వైసీపీ హయాంలో బయటకు రావడానికే టీడీపీ నేతలు భయపడే పరిస్థితి ఉండేది. గత ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని చంద్రబాబు పదే పదే విమర్శించేవారు. గవర్నర్ కు లెక్కకు మించిన సార్లు ఫిర్యాదు చేశారు. కానీ ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం చంద్రబాబు గత పాలనలా లేదన్న విమర్శలు మాత్రం వినిపిస్తున్నాయి.
గత ప్రభుత్వంలో...
గత ప్రభుత్వంలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరిగి ఉండవచ్చు. అయితే దానికి ప్రతీకారంగా తిరిగి దాడులకు దిగితే ఆ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి పెద్ద తేడా ఏముంటుందన్న ప్రశ్నలు నేరుగానే సోషల్ మీడియాలో వేస్తుండటం కనిపిస్తుంది. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించవద్దంటూ ప్రతిపక్షంలో పదే పదే హెచ్చరించిన చంద్రబాబు సర్కార్ ఇప్పుడు అదే పనిచేస్తుండటాన్ని పలువురు మేధావులు కూడా తప్పుపడుతున్నారు. ప్రజలు అంతా గమనిస్తుంటారని, వారికి సరైన సమయం వచ్చినప్పుడు తమ నిర్ణయాన్ని ప్రకటిస్తారని, అందుకే చంద్రబాబు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యపై ప్రత్యేకంగా దృష్టి సారించడం పార్టీకే మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి.


Tags:    

Similar News