Rajya Sabha : ఆ మూడు స్థానాల్లో అభ్యర్థులు వీరేనా? చంద్రబాబు ఓకే చేసినట్లేనా?

వైసీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయడంతో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి.

Update: 2024-09-27 11:50 GMT

 rajya sabha elections

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. వైసీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయడంతో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ మూడుస్థానాలు కూటమి ఖాతాలోకే పడతాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎమ్మెల్యేల బలం కూటమికి పుష్కలంగా ఉంది. వైసీపీకి 11 మంది సభ్యులు మాత్రమే ఉండటంతో అది పోటీ చేసే పరిస్థితి కూడా లేదు. 164 మంది శాసనసభ్యులున్న మూడు రాజ్యసభ స్థానాలను కూటమి కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. అందిన సమాచారం మేరకు ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఈ పదవుల పంపకంపై ఒక క్లారిటీకి వచ్చినట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

రెండు టీడీపీ, ఒకటి జనసేనకు...
మూడింటిలో ఒకటి జనసేనకు ఇచ్చి, మిగిలిన రెండు స్థానాలను టీడీపీ తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ రాజ్యసభ పదవుల్లో బీజేపీకి మాత్రం రిక్త హస్తం చూపుతున్నారని తెలిసింది. ఇటీవల ఇరవై నామినేటెడ్ పోస్టులు ప్రకటిస్తే అందులో పదహారు టీడీపీ తీసుకోగా, మూడు జనసేనకు ఇచ్చింది. ఒకటి మాత్రమే బీజేపీకి ఇచ్చింది. నామినేటెడ్ పోస్టుల విషయంలోనే కొంత ఆచితూచి వ్యవహరించిన చంద్రబాబు రాజ్యసభ స్థానాల విషయంలో రాజీపడబోరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించి తమకు రాజ్యసభలో ప్రాతినిధ్యం లేనందున టీడీపీ, జనసేన పార్టీలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది.
టీడీపీ నుంచి...
అయితే ఇందులో రెండింటిలో ఒకటి గల్లా జయదేవ్ కు ఇస్తారని చెబుతున్నారు. గల్లా కుటుంబంతో ఉన్న అనుబంధంతో పాటు ఢిల్లీలో గల్లా జయదేవ్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆయనకు రాజ్యసభ పదవిని ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. గల్లా జయదేవ్‌ను ఢిల్లీలో ఉంచి రాష్ట్రానికి రావాల్సిన అన్ని ప్రయోజనాల విషయంలో అధికారులను, కేంద్రమంత్రులను తరచూ కలిసే బాధ్యతలను కూడా అప్పగిస్తారని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గల్లా జయదేవ్ పేరు ఖరారయిందని, ఆయన పేరు ఇక ప్రకటించడమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గల్లా జయదేవ్ తో పాటు మరో సీనియర్ నేత అశోక్ గజపతి రాజు పేరు కూడా బలంగా వినిపిస్తుంది.
జనసేన నుంచి...
క్షత్రియ సామాజికవర్గానికి రాజ్యసభ పదవి ఇవ్వకపోవడంతో ఆ సామాజికవర్గం కొంత అసంతృప్తితో ఉందని భావించిన చంద్రబాబు అశోక్ గజపతిరాజును పెద్దలసభకు పంపుతారని తెలుస్తోంది. ఆయన పేరు కూడా దాదాపు ఖరారయిందని పార్టీలో అత్యంత సీనియర్ నేత ఒకరు చెప్పడం విశేషం. అందుకే అశోక్ గజపతి రాజు ఈ పదవి కోసమే ఎదురు చూస్తున్నారని అంటున్నారు. మరొక వైపు జనసేన నుంచి రాజ్యసభ అభ్యర్థిగా పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు పేరు ఖరారయినట్లు తెలిసింది. నాగబాబు పేరును చంద్రబాబుకు పవన్ ప్రతిపాదించినట్లు అందిన సమాచారం ప్రకారం తెలుస్తోంది. దీంతో మూడు రాజ్యసభ స్థానాలకు దాదాపు అభ్యర్థులు ఖరారయినట్లేనని, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రకటన ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


Tags:    

Similar News