ఏలూరులో వైద్యుల నిర్వాకం
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వారం క్రితం కాన్పు కోసం ఓ గర్భిణీ మహిళ చేరగా
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వారం క్రితం కాన్పు కోసం ఓ గర్భిణీ మహిళ చేరగా.. ఆమెకు వైద్యం చేసిన తర్వాత కడుపులో కత్తెరను మరచిపోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వైద్యుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా మళ్లీ ఆపరేషన్ ను నిర్వహించాలని వైద్యులు భావించారు. ఇంతలో బయటకు విషయం తెలిసిపోయింది.
అప్పట్లో ఆమెకు సిజేరియన్ చేసి, పండంటి బిడ్డను బయటకు తీశారు. ఆపరేషన్ తర్వాత కుట్లు వేసే క్రమంలో కడుపులో ఉన్న కత్తెరను తీయడం మరిచిపోయారు. అప్పటి నుంచి బాధితురాలు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. దీంతో వైద్యులు ఎక్స్‌రే తీయించగా కడుపులో కత్తెర ఉన్న విషయం వెలుగు చూసింది. ఈ ఘటన గురించి బయట ప్రపంచానికి తెలియకుండా చేయాలని వైద్యులు భావించారు. ఆ ఎక్స్‌రే ఫొటోను ఓ ఉద్యోగి తన ఫేస్‌బుక్, ట్విటర్ ఖాతాల్లో పోస్టు చేశాడు. దీంతో ఈ వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది. ఆసుపత్రి అధికారులు ఆ ఉద్యోగిని పిలిచి మందలించడంతో ఆ పోస్టులను తొలగించాడు. అప్పటికే ఈ విషయం బయటకు పొక్కడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి రికార్డుల్లో బాధితురాలి వివరాలు కూడా మాయం చేశారని ఆరోపణలు వచ్చాయి.