అమరావతి : 10వ తరగతి ప్రశ్నాపత్రం లీక్ కేసులో మాజీ మంత్రి పి.నారాయణ ఇద్దరు కుమార్తెలు, అల్లుడు, మరికొందరికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. నారాయణ గ్రూపు విద్యాసంస్థలకు చెందిన నారాయణ కుమార్తె పి.శరణి, పి.సింధూర, అల్లుడు కె.పునీత్‌తో పాటు మరో 10 మందికి ముందస్తు బెయిల్ లభించింది. పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం లీకేజ్ ఆరోపణలపై చిత్తూరు వన్ టౌన్ పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులో మాజీ మంత్రి నారాయణ కుమార్తెలు పొంగూరు శరణి, పొంగూరు సింధూర, అల్లుడు కె పునీత్ సహా మరికొందరు ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషిన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. పిటిషనర్లపై ఈ నెల వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. వారు దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కె. మన్మధరావు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు, వారిపై తొందరపడి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించారు. తదుపరి విచారణను కోర్టు మే 18కి వాయిదా వేసింది.