Balineni Srinivasulu Reddy : పాపం బాలినేని..జనసేనలో చేరుతున్నా మనశ్శాంతి లేకపోయెనే?
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డికి పార్టీ మారినా కష్టాలు మాత్రం వెన్నంటే ఉన్నాయని పిస్తోంది.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డికి పార్టీ మారినా కష్టాలు మాత్రం వెన్నంటే ఉన్నాయని పిస్తోంది. బాలినేనికి మనశ్శాంతి లేకుండా పోయింది. బాలినేని శ్రీనివాసులురెడ్డి వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ ను కలసి జనసేనలో చేరే విషయంపై చర్చించారు. పవన్ కల్యాణ్ ఒంగోలు వచ్చినప్పుడు తాను చేరతానని ప్రకటించారు. కానీ ఈ నెల 26వ తేదీన జనసేనలో సామినేని ఉదయభాను, కిలారు రోశయ్య, బాలినేని శ్రీనివాసులురెడ్డిలను పార్టీలోకి చేర్చుకుని జనసేన కండువా కప్పేందుకు పవన్ సిద్ధమయ్యారు. దీంతో ఈ నెల 26వ తేదీన బాలినేని జనసేనలో చేరిక దాదాపు ఖాయమయినట్లే చెబుతున్నారు.
ఫ్లెక్సీల రగడ...
కానీ బాలినేని శ్రీనివాసులురెడ్డి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలసి వచ్చిన తర్వాత ఒంగోలులో పెద్దయెత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. అందులో దామచర్ల జనార్థన్ ఫొటో కూడా ఉండటంతో టీడీపీ నేతలు అభ్యంతరం తెలిపారు. ఫ్లెక్సీలను చించిపడేశారు. బాలినేనికి స్వాగతం చెప్పే ఫ్లెక్సీలలో తమ నేత ఫొటో ఉంటే అంగీకరించబోమని తెలిపారు. బాలినేని ఎంత ప్రయత్నించినా తమకు చేరువ కాలేరంటూ వార్నింగ్ లు ఇచ్చారు. జనసేనలో చేరితే వారి వరకూ ఫొటోలు ముద్రించుకుని ఆనందపడమని, తమ నేత ఫొటోలను ముద్రిస్తే ఒప్పుకోబోమని కూడా ఒంగోలు నియోజకవర్గంలోని టీడీపీ నేతలు హెచ్చరికలు పెద్దయెత్తున పంపారు.
ఎప్పటి నుంచో విభేదాలు...
బాలినేని శ్రీనివాసులురెడ్డికి ఒంగోలు ప్రస్తుత ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే విభేదాలున్నాయి. ఎన్నాళ్ల నుంచి ఇద్దరి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడిచాయి. ఎన్నికల సందర్భంగా టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. దామచర్ల ఎన్నికపై న్యాయస్థానాన్ని ఆశ్రయించిన బాలినేని శ్రీనివాసులురెడ్డి ఈవీఎంలను తిరిగి లెక్కించాలని కోరారు. ఈవీఎంలను తిరిగి పరిశీలించారు. ఇవన్నీ మనసులో పెట్టుకున్న దామచర్ల జనార్థన్ తమ మిత్రపక్షమైన జనసేనలో చేరినా బాలినేనిని శత్రువుగానే పరిగణిస్తున్నారు. సుదీర్ఘకాలం ఇద్దరి రాజకీయ ప్రయాణం వేరుగా ఉండేది. బాలినేని కాంగ్రెస్, వైసీపీలో ఉండగా, దామచర్ల మాత్రం తొలి నుంచి టీడీపీలోనే ఉన్నారు.
తాజాగా ప్రకటనతో...
అయితే తాజాగా దామచర్ల జనార్థన్ చేసిన ప్రకటనతో బాలినేని శ్రీనివాసులురెడ్డి జనసేనలో చేరినా విభేదాలు సమసిపోయేటట్లు కనిపించడం లేదు.వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు పోరాటం చేశామని, ఒంగోలులో టీడీపీ శ్రేణులు పై బాలినేని అక్రమ కేసులు పెట్టించారని, తనపై 32 కేసులు పెట్టారన్నారు. తమ నాయకుడు చంద్రబాబుని కూడా బాలినేని దూషించారని, అధికారం పోయి 100 రోజులు గడవకముందే బాలినేని పార్టీ మారుతున్నారన్నారు. జనసేనలో చేరకముందే బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. ఏ పార్టీలో కి వెళ్ళినా కేసుల్లో నుండి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన కొడుకు తప్పించుకో లేరని దామచర్ల వార్నింగ్ ఇచ్చారు. గత ఐదేళ్లలో బాలినేని చేసిన అక్రమాలను బయటకు తీస్తామన్న జనార్థన్ బాలినేని చేసిన అక్రమాల నుండి పవన్ కళ్యాణ్ కూడా కాపాడలేరంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.