విశాఖలో భూ దోపిడీ నిజం కాదా?

విశాఖలో భూ దోపిడీ జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. దసపల్లా భూములను కాజేయడానికి కుట్ర జరిగిందన్నారు

Update: 2022-10-12 07:27 GMT

విశాఖలో భూ దోపిడీ జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. దసపల్లా భూములను కాజేయడానికి కుట్ర జరిగిందన్నారు. ఈ దోపిడీపై సమగ్రమైన విచారణ జరగాలని నరేంద్ర డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రలో వనరుల దోపిడీకి ఈ ప్రభుత్వం తెరతీసిందని ఆయన ఆరోపించారు. ఉత్తరాంధ్రలో బీసీలు ఎక్కువని విజయసాయిరెడ్డి చెప్పారని, మరి పార్టీ ఇన్ ఛార్జులుగా ఏ సామాజికవర్గం ఉందని నరేంద్ర ప్రశ్నించారు. మొన్నటి వరకూ విజయసాయిరెడ్డి, నేడు వైవీ సుబ్బారెడ్డి లు ఇన్ ఛార్జిలుగా ఉన్న విషయం వాస్తవం కాదా? అని నరేంద్ర నిలదీశారు. మీ సామాజికవర్గం నేతలను ఇన్‌ఛార్జిగా పెట్టుకుని ఉత్తరాంధ్రలో భూదోపిడీకి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.

ఇన్ని కాంట్రాక్టులు...?
జగన్ కు అధికారం ఇచ్చింది ప్రభుత్వ ఆస్తులను దోచుకోవడానికా? అని ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు. ఈ మూడున్నరేళ్లలో మీ కుటుంబ కంపెనీలకు ఎన్ని ప్రాజెక్టులు వచ్చాయో చెప్పాలని ఆయన కోరారు. కాకినాడ ఎయిర్ పోర్టు, జీఎంఆర్ కంపెనీ కాకినాడ ఎస్ఈజడ్ లో షేర్లను అరబిందో కంపెనీకి కట్టబెట్టిన వాస్తవమా? కాదా? చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రామాయపట్నం పోర్టును నవోదయ, అరబిందో కంపెనీకి అప్పగించిన నిజమా? కాదా? అని నరేంద్ర ప్రశ్నించారు. భూదోపిడీపై సమాధానం చెప్పకుండా అడ్డగోలుగా విజయసాయిరెడ్డి బుకాయిస్తున్నారని ఆయన అన్నారు. వేల కోట్ల విలువైన ఆస్తులు, పనులను విజయసాయిరెడ్డి అల్లుడి చెందిన కంపెనీకి ఎలా వచ్చాయని ఆయన నిలదీశారు.


Tags:    

Similar News