చంద్రబాబు గెంటేశారు.. సీఎం జగన్ అక్కున చేర్చుకున్నారు
తెలుగు దేశం పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు
తెలుగు దేశం పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు వైఎస్సార్‌సీపీలో చేరారు. బుధవారం మధ్యాహ్నాం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో సూర్యారావు వైసీపీ కండువా కప్పుకున్నారు. అంతకు ముందు టీడీపీకి గొల్లపల్లి సూర్యారావు రాజీనామా చేశారు. తన ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దెబ్బతీసినందునే రాజీనామా చేస్తున్నట్లు గొల్లపల్లి తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆయన ఒక బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు గొల్లపల్లి సూర్యారావు. చంద్రబాబు నన్ను మెడపట్టుకుని బయటకు గెంటారని.. ఆ బాధలో ఉన్న నన్ను సీఎం జగన్ అక్కున చేర్చుకున్నారన్నారు. సీఎం జగన్ నాయకత్వంలో వైఎస్సార్‌సీపీ కోసం శాయశక్తుల పని చేస్తానని సూర్యారావు తెలిపారు.
టీడీపీ, జనసేన ప్రకటించిన ఉమ్మడి ఎమ్మెల్యేల అభ్యర్థుల జాబితాలో గొల్లపల్లి పేరు లేకపోవడంతో ఆయన కలత చెందారు. పొత్తులో భాగంగా రాజోలు సీటును జనసేనకు టీడీపీ కేటాయించింది. గొల్లపల్లి 2004లో తొలిసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. వైఎస్ కేబినెట్‌లో చిన్న పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేశారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి 2014లో రాజోలు నుంచి గెలిచారు. అయితే 2019లో రాపాక వరప్రసాద్ చేతిలో ఓడారు.