Pinnelli : పిన్నెల్లి మాచర్ల వచ్చేలోగా సీన్ మారిపోయిందా?
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ లభించింది. ఈ మేరకు ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసిన తీర్పును వెల్లడించింది
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ లభించింది. ఈ మేరకు ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసిన తీర్పును వెల్లడించింది. ఎన్నికల రోజున పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేయడంతో పాటు సీఐపై దాడి కేసులో ఆయనపై కేసు నమోదయింది. ఆయనను అరెస్ట్ చేసి నెల్లూరు జైలులో ఉంచారు. దాదాపు రెండు రోజుల నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలులోనే ఉన్నారు. పార్టీ అధినేత జగన్ కూడా వెళ్లి ఆయనను పరామర్శించి వచ్చారు.
షరతులతో కూడిన...
అయితే ఎన్నిమార్లు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నా రాలేదు. కానీ ఈరోజు మాత్రం బెయిల్ మంజూరయింది. అయితే షరతులతో కూడిన బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. యాభై వేల విలువైన రెండు పూచీకత్తులు సమర్పించాలని, పాస్ పోర్టు అప్పగించాలని, ప్రతి వారం పోలీస్ స్టేసన్ లో హాజరై సంతకం చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఆయన బెయిల్ పై విడుదలయి మాచర్ల వచ్చేలోగా అక్కడ పరిస్థితులన్నీ మారిపోయాయి. మాచర్ల మున్సిపాలిటీ చేజారి పోయింది.
ముఖ్యనేతల రాజీనామా...
దీంతో పాటు ముఖ్యనేతలు పార్టీకి రాజీనామా చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు కూడా మాచర్లలో లేకపోవడంతో పార్టీ నేతలు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. ఆయన వచ్చేలోగా మాచర్లలో వైసీపీ దాదాపు ఖాళీ కావడంతో ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తిరిగి మాచర్లలో రాజకీయం మొదలు పెట్టాల్సి ఉంది. అయితే ఆయన బెయిల్ పై విడుదలయి వస్తే శాంతి భద్రతలు దెబ్బతింటాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిసింది.
హైదరాబాద్ లోనే...
దీంతో పల్నాడు జిల్లాలో తిరిగి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. పిన్నెల్లి చుట్టూ షాడో టీమ్స్ ను ఏర్పాటు చేసే యోచనలో పోలీసులున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా ఇప్పుడిప్పుడే మాచర్లకు రాకపోవచ్చని ఆయన కొంత కాలం హైదరాబాద్ లో గడిపి కోర్టు విధించిన షరతుల మేరకు వారానికి ఒకసారి మాచర్ల వచ్చి పోలీస్ స్టేషన్ లో సంతకం చేసి వెళతారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పిన్నెల్లి మాచర్ల వస్తున్న సందర్భంగా ఎలాంటి స్వాగతాలు, హడావిడి ఏర్పాటు చేసినా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.