Amabati Rambabu : ఇదేంది బాబయ్యా.. అంబటి సెటైర్లు
మాజీ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబు ప్రభుత్వం పై సెటైర్లు వేశారు;

మాజీ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబు ప్రభుత్వం పై సెటైర్లు వేశారు. పీ4 అంటూ ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు సిద్ధమయ్యారని అంబటి రాంబాబు అన్నారు. పేదలకు ప్రభుత్వం సాయం అందించాలి కానీ, సంపన్నులను ఇందులో భాగస్వామ్యుల్ని చేయడమేంటని అంబటి రాంబాబు ప్రశ్నించారు. సెల్ ఫోన్లు తానే కనిపెట్టారంటున్నారని, ఐటీ తానే తెచ్చానని ప్రతి సభలో చెబుతూ చంద్రబాబు విసిగించడం మానుకుని సూపర్ సిక్స్ అమలు చేయడంపై దృష్టి పెట్టాలని కోరారు.
పీ4 పథకంపై...
చంద్రబాబు ధోరణిని చూస్తుంటే రాష్ట్రాన్ని సంపన్నులకు అమ్మేసేటట్లు కనపడుతుందని అన్నారు. అసలు పేదరికం నిర్మూలన కోసం ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పడం మానేసి పీ4 అంటూ ధనికులను వేదికపైకి తెచ్చి అతి పెద్ద డ్రామాకు తెరతీశారని అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. దాని వల్ల నిజంగా ఇరవై లక్షల కుటుంబాలు తొలి దశలో బాగుపడతాయా? అని అంబటి ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేక పక్కదోవపట్టించేందుకు ఇలా పని చేయని పథకాలను తెస్తున్నారంటూ దుయ్యబట్టారు.