ముగ్గురూ కలసి రండి : నాని

ముగ్గురు కలిసినా ఇరవై ఏళ్ల పాటు జగన్ ను ఏం చేయలేరని వచ్చే ఎన్నికల్లో అర్థమవుతుందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు

Update: 2023-09-14 11:48 GMT

ముగ్గురు కలిసినా ఇరవై ఏళ్ల పాటు జగన్ ను ఏం చేయలేరని వచ్చే ఎన్నికల్లో అర్థమవుతుందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడరు. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో జీఎస్టీతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా అవినీతి జరిగిందని చెప్పాయన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేరు మీద డబ్బులు దోచుకోవడాన్ని సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. చంద్రబాబుతో ఎందుకు విభేదించారు? మళ్లీ ఎందుకు కలిశారో? చెప్పాలని పేర్ని నాని పవన్ కు సవాల్ విసిరారు. తమ్ముడు లోకేష్ తో చినమామయ్య బాలకృష్ణతో కలసి పోటీ చేస్తామని చెప్పి జైలు నుంచి బయటకు వచ్చి చెప్పారంటూ ఎద్దేవా చేశారు. ఈ కలయిక ఉంటుందని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని, అందుకే పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్నారు.

సిద్ధాంతాలు లేని...
పార్టీ పెట్టిన ఏడేళ్లకు 151 స్థానాలు సాధించుకున్న జగన్‌కు, కనీసం బూత్ లెవెల్ కమిటీలు కూడా వేసుకోలేని పవన్ కల్యాణ‌్ మాట్లాడటమేంటని పేర్ని నాని ప్రశ్నించారు. సిద్ధాంతాలు, ఎత్తుగడలు, వ్యూహాలు లేకుండా రోజుకో మాట, పూటకోమాట అని నిలదీసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. అందుకే తాము పవన్ ను నిలదీస్తున్నామని తెలిపారు. తాను చంద్రబాబు కోసమే పార్టీనని చెప్పమనండి తమకు ఏమాత్రం అభ్యంతరం లేదన్నారు. అబద్ధాలు మాట్లాడుతున్నారు కాబట్టి తాము ప్రశ్నిస్తున్నామని పేర్ని నాని అన్నారు. అధికారులకు వార్నింగ్ ఇస్తూ అందరి చేత నవ్వులు పూయిస్తున్నారన్నారు. సినిమాల్లో హీరో అని రాజకీయాల్లో జోకర్ గా మారారని అన్నారు.
అవినీతి కేసులో...
అవినీతి కేసులో చంద్రబాబును అరెస్ట్ చేస్తే దానిని తప్పుపడతావా అని నిలదీశారు. మూడు వందల కోట్ల రూపాయలు చిన్న మొత్తం కాదని, ఇది టోకెన్ అమౌంట్ మాత్రమేనని, ఇంత డబ్బా అని ఆశ్చర్యపోయే రోజు త్వరలోనే ఉందని పేర్ని నాని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లను ఎవరినీ వదలనని అంటున్నారని, అసలు అధికారంలోకి వస్తే కదా? వదలకపోవడానికి అంటూ నాని ఎద్దేవా చేశారు. విడతకో పార్టీతో పొత్తు పెట్టుకోవడం జనసేన సిద్ధాంతమా? అని పేర్ని నేని ప్రశ్నించారు. నమ్ముకున్న జనసైనికులను మోసం చేయడం కాక ఇదేమిటన్నారు. బాబాయిని జైల్లో వేస్తే కాని బయటకు రాలేదని నాని సెటైర్ వేశారు.



Tags:    

Similar News