Yanamala : ఇప్పుడు బాధడుతున్నారా? అన్ని సీట్లు తీసుకుని మంత్రి పదవికి దూరమయ్యారా?

మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఇప్పుడు మంత్రి పదవి దక్కలేదని బాధపడుతున్నట్లుంది.

Update: 2024-07-03 06:58 GMT

టీడీపీలో సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఇప్పుడు బాధపడుతున్నారు. మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడంపై పైకి ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా, కొత్త వారికి అవకాశం కల్పించడంలో భాగంగా తన లాంటి సీనియర్లను దూరం పెట్టారని అనుకున్నా అందుకు మరొక కారణం కూడా ఉందని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఆయన మొన్నటి ఎన్నికల్లో మూడు టిక్కెట్లను తీసుకోవడమే మంత్రి పదవి రాకపోవడానికి ఒక కారణంగా చెబుతున్నారు. సీనియర్ నేతలందరినీ పక్కన పెట్టినా, తనను దూరం పెట్టడానికి ప్రధాన కారణం తన కుటుంబంలో అత్యధిక సీట్లు తెచ్చుకోవడం వల్లనేనని ఆయన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తునట్లు తెలిసింది.

అదే కారణమని...
ఎందుకంటే చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఖచ్చితంగా యనమల రామకృష్ణుడు కేబినెట్ లో ఉంటారు. ముఖ్యమైన శాఖలను యనమలకు చంద్రబాబు అప్పగిస్తారు. ప్రధానంగా గత వైసీపీ ప్రభుత్వంలో శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లు వెనక్కు పంపడంలోనూ యనమల కీలక పాత్ర పోషించారని, అలాంటి అనుభజ్ఞులైన వారే పార్టీకి కొండంత అండ అని చంద్రబాబు నాడు ప్రశంసించిన విషయాన్ని కూడా యనమల సన్నిహితులు గుర్తు చేస్తున్నారు. అలాంటిది ఈసారి యనమల రామకృష్ణుడుకు స్థానం కల్పించకపోవడంతో ఒకింత షాక్ కు గురయినప్పటికీ, సీట్లకు సీట్లు, ఇటు కేబినెట్ లో పదవి ఎలా ఇస్తారన్న వ్యాఖ్యలు కూడా వినపడుతున్నాయి.
నలుగురు పదవుల్లో...
యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన కుమార్తె యనమల దివ్య తూర్పు గోదావరి జిల్లా తుని శాసనసభ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇక ఆయన వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఇక యనమల అల్లుడు పుట్టా మషేష్ యాదవ్ ఏలూరు పార్లమెంటు టిక్కెట్ ను పొంది పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇలా ఒకే కుటుంబం నుంచి నలుగురు ఏదో ఒక పదవిలో ఉన్నారు. అదే ఆయనకు అడ్డంకిగా మారింది. అయితే యనమల రామకృష్ణుడు మాత్రం తన ప్రయత్నాలను వదిలిపెట్టడం లేదని పిస్తుంది. ఏదో రకంగా చంద్రబాబు దృష్టిలో పడాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు.
బాబుకు లేఖ...
అందులో భాగంగా యనమల రామకృష్ణుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. వైసీపీ నేతలు గత ఐదేళ్లలో సంపాదించిన అక్రమార్జనను రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా రాబట్టవచ్చని తెలిపారు. దీంతో పాటు గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పుల నుంచి బయటపడేందుకు ఈ ప్రభుత్వం చేస్తున్న చర్యలను ఆయన అభినందించారు. తనకున్న అనుభవంతో ఆయనకు పదిహేను అంశాలతో సూచనలు చేయడం ఇప్పుడు మళ్లీ చంద్రబాబు దృష్టిలో పడటానికేనని అంటున్నారు. తన అనుభవాన్ని ఆయన లేఖ రూపంలో చంద్రబాబుకు తెలియజేయడాన్ని చూస్తే ఏదో రకంగా కేబినెట్ లోకి చొరబడాలని ప్రయత్నమేనని అంటున్నాయి టీడీపీ వర్గాలు. మరి చంద్రబాబు యనమల ప్రయత్నాలకు సానుకూలంగా స్పందిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News