Ap Politics : వైసీపీ పై తప్పులు నెట్టేస్తే సరిపోతుందా? నాలుగు నెలల నుంచి ఏం చేశారు?

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు దాటుతుంది. అయినా గత ప్రభుత్వం వల్లనే అంటూ వేలు చూపుతుంది

Update: 2024-10-22 08:28 GMT

ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏదైనా కొద్ది రోజుల పాటు గత ప్రభుత్వంపై నెపం వేయవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వ వైఫల్యాల కారణంగానే ఈ సమస్య తలెత్తిందని చెప్పి నమ్మించవచ్చు. ప్రజలు కూడా దానిని విశ్వసిస్తారు. కానీ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు అయిన తర్వాత కూడా ఏర్పడుతున్న సమస్యలకు గత ప్రభుత్వమే కారణమని చెబుతూ తప్పించుకోవడానికి ఈ ప్రభుత్వం చూస్తే ప్రజలు ప్రస్తుతం సైలెంట్ గా చూస్తుండ వచ్చు. వినవచ్చు. అంతే తప్ప సరైన సమయంలో ఇలా ఆరోపణలు చేసే వారికి తగిన రీతిలో గుణపాఠం ప్రజలు చెబుతారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు దాటుతుంది. ఐదో నెలలోకి కొత్త ప్రభుత్వం ప్రవేశిస్తుంది.

అతిసారతో ఎనిమిది మంది...
అయినా సరే విజయనగరం జిల్లాలో అతి సార వ్యాధి సోకి ఎనిమిది మంది మృతి చెందారు. అక్కడ తాగునీటి తాగినందువల్లనే ప్రజలు మృత్యువాత పడ్డారు. అనేక మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ మరణాలకు కారణం బాధ్యులు ఎవరని ప్రశ్నించడం కంటే వెంటనే అక్కడ చర్యలు ప్రారంభించడం, మరణాలకు కారణాలు కనుగొనడం, వ్యాధి ప్రబలకుండా అత్యవసర చర్యలు తీసుకోవడం, డయేరియాతో బాధపడుతున్న వారిని అవసరమైతే విశాఖ వంటి ప్రాంతాలకు తరలించి మెరుగైన చికిత్స వంటివి చేయాల్సి ఉంటుంది. అక్కడ బోర్లు, మంచినీటి సరఫరా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సి ఉంది.
గత వైసీపీ ప్రభుత్వమే కారణమని...
ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా గొర్ల గ్రామంలో ఎనిమిది మంది కలుషిత నీటిని తాగి ఎనిమిది మంది మరణించడం వెనక గత వైసీపీ ప్రభుత్వమే కారణమని నేటి పాలకులు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో మంచినీటి పైపులను బాగు చేయకపోవడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. మరి ఐదు నెలలు వచ్చిన ఈ ప్రభుత్వం ఏం చేసినట్లో మాత్రం చెప్పలేదు. తప్పిదాన్ని గత ప్రభుత్వం పై నెడితే సరిపోతుందా? అన్న ప్రశ్నకు మాత్రం వారి వద్ద సరైన సమాధానం లేదు. రక్షిత మంచినీటి సరఫరా బదులు కలుషిత నీరు సరఫరా అవుతున్నా పట్టించుకోని అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?
పవన్ కల్యాణ్ పర్యటించి...
అదే సమయంలో గొర్ల గ్రామంలో పవన్ కల్యాణ్ పర్యటించారు. బాధితులను పరామర్శించారు. అంతవరకూ బాగానే ఉన్నప్పటికీ పవన్ కల్యాణ్ కూడా గత ప్రభుత్వంపైనే నిందను మోపే ప్రయత్నం చేయడంపై విమర్శలు తలెత్తుతున్నాయి. గత ప్రభుత్వం ఐదేళ్లు పాలన చేసింది. ఈ ఐదేళ్లు జరగని ఈ కలుషిత నీటి సరఫరా ఇప్పుడే ఎందుకు ప్రజల గొంతులోకి దిగింది? అన్నది మాత్రం చెప్పలేకపోతున్నారు. బాధిత ప్రాంతంలో పర్యటించేది మంచిదే. దానిని ఎవరూ కాదనరు. అదే సమయంలో అధికారులతో సమీక్ష చేయడం కూడా మంచిదే కానీ అసలు కారణాలను వెతకకుండా వెనక్కు వెళ్లి విమర్శలు చేయడం ఎవరికీ తగదన్న సూచనలు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News