శ్రీకాకుళం తీరప్రాంతానికి కొట్టుకొచ్చిన బంగారువర్ణ రథం (వీడియో)
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శ్రీకాకుళం జిల్లాలో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. బంగారు వర్ణంలో ఉన్న ఓ రథం..
శ్రీకాకుళం : అసని తీవ్రతుఫానుగా రూపం దాల్చడంతో.. బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. ఏపీలోని అన్ని తీరప్రాంతాల్లో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. రాకాసి అలలకు తీరప్రాంతాలు కోతకు గురవుతున్నాయి. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శ్రీకాకుళం జిల్లాలో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. బంగారు వర్ణంలో ఉన్న ఓ రథం సంతబొమ్మాళి మండలం సున్నాపల్లి రేవువద్దకు కొట్టుకొచ్చింది. ఆ రథంపై 16-1-2022 తేదీతో పాటు విదేశీ భాష రాసి ఉన్నట్లు తెలుస్తోంది.
దానిని బట్టి ఆ రథం థాయిలాండ్ లేదా మలేషియా, జపాన్ దేశాలకు చెందినది అయి ఉండవచ్చని అక్కడున్న మత్స్యకారులు చర్చించుకుంటున్నారు. కాగా.. గతంలో ఎన్నో భారీ తుఫానులు వచ్చినా.. ఇలాంటివి ఎప్పుడూ ఇలా తీరానికి కొట్టుకొచ్చిన దాఖలాలు లేవని చెప్తున్నారు స్థానికులు. సముద్రంలో ఇంత దూరం రథం కొట్టుకురావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బంగారు వర్ణంలో ఉన్న ఆ రథాన్ని చూసేందుకు స్థానికులు పోటెత్తగా.. ఆ రథాన్ని మెరైన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.