భక్తులకు శుభవార్త.. 10రోజుల పాటు తెరచుకోనున్న తిరుమల వైకుంఠ ద్వారం

తిరుమల ఏడుకొండలపై వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం వైకుంఠ ద్వారాలు 10 రోజుల పాటు తెరుచుకోనున్నాయి.

Update: 2021-12-28 11:24 GMT

తిరుమల ఏడుకొండలపై వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం వైకుంఠ ద్వారాలు 10 రోజుల పాటు తెరుచుకోనున్నాయి. జనవరి 13వ తేదీ ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని.. ఆరోజు నుంచి జనవరి 22వ తేదీ వరకూ వైకుంఠ ద్వారాలను తెరవనున్నట్లు టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి వెల్లడించారు. 10రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి ఏటా రెండ్రోజుల పాటు మాత్రమే తెరిచి ఉంచే ఈ ద్వారాన్ని.. భక్తుల రద్దీ దృష్ట్యా ఈసారి 10 రోజుల పాటు తెరిచి ఉంచాలని టీటీడీ నిర్ణయించింది.

ప్రతి ఏటా రెండ్రోజులు మాత్రమే..

ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో మాత్రమే తిరుమల శ్రీవారి ఆలయం వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఈ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే వచ్చే ఏడాది 10 రోజులపాటు వైకుంఠ ద్వారాన్ని తెరిచి.. భక్తులకు స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఈఓ ధర్మారెడ్డి వివరించారు. ఇదే సమయంలో మరో గుడ్ న్యూస్ కూడా చెప్పారు.

తిరుపతి వాసులకు గుడ్ న్యూస్

జనవరి 12వ తేదీ నుంచి 21వ తేదీ వరకూ రోజుకు 5వేల ఆఫ్ లైన్ టికెట్లను తిరుపతి వాసులకు కేటాయించినట్లు పేర్కొన్నారు. మొత్తం 10 రోజులకు గాను 50 వేల సర్వదర్శనం టోకెన్లను తిరుపతి ప్రజలకు జారీ చేయనున్నట్లు తెలిపారు. అలాగే జనవరి 11వ తేదీ నుంచి 12వ తేదీ ఉదయం వరకు తిరుమలలో ఎవరికీ గదులను కేటాయించడం లేదని స్పష్టం చేశారు. జనవరి 13వ తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 9 గంటలకు స్వర్ణ రథోత్సవ సేవ, 14వ తేదీ ఉదయం 5గంటలకు చక్రస్నానం నిర్వహించనున్నట్లు ఈఓ ధర్మారెడ్డి తెలిపారు.

Tags:    

Similar News