Andhra Pradesh : కీలక పోస్టుల కోసం క్యూ కడుతున్న అధికారులు.. పైరవీలు చేయించుకునేందుకు పాట్లు
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారింది. దీంతో అధికారులు కూడా తమ రూటు మార్చారు
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారింది. దీంతో అధికారులు కూడా తమ రూటు మార్చారు. గత ప్రభుత్వంలో అప్రధాన పోస్టుల్లో ఉన్న అధికారులు ఎక్కువ మంది ఈ ప్రభుత్వంలో కీలక పోస్టులను తీసుకునేందుకు సిద్ధమయ్యారు. గత ఐదేళ్లు తమను పక్కన పెట్టడంతో నిశ్శబ్దంగానే ఉన్న అధికారులు తమకు అనుకూలమైన ప్రభుత్వం రావడంతో ప్రాధాన్యత గల పోస్టులను చేజిక్కించుకునేందుకు అప్పుడే సిద్ధమయ్యారు. ముఖ్యంగా పోలీసు శాఖ, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు, రవాణా శాఖ, ఎక్సైజ్ శాఖ వంటి పోస్టులకు మరింత గిరాకీ ఏర్పడింది. అయితే ఎవరి ద్వారా వెళితే పని అవుతుందో తెలిసిన అధికారులు ఆ మార్గాలను ఎంచుకుంటున్నారు.
జిల్లా స్థాయి అధికారులతో పాటు...
సహజంగా ఒకస్థాయి అధికారులు నేరుగా కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు వెళ్లే అవకాశం ఉండదు. వెళ్లినా ఆయనకు శుభాకాంక్షలు తెలిపి వస్తున్నారు తప్పించి అంతకు మించి మాట్లాడే అవకాశం కూడా ఉండటం లేదు. దీంతో అధికారులు ఆ తర్వాత ఉన్ననేతల వద్దకు క్యూ కడుతున్నారు. గత ప్రభుత్వంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులను చెప్పడంతో పాటు ఆ ప్రభుత్వంలో జరిగిన లోటుపాట్లను కూడా వివరిస్తూ తమను తాము దగ్గరయ్యేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో జిల్లా స్థాయి అధికారులతో పాటు రాష్ట్ర స్థాయి అధికారులు కూడా ఉన్నారు. అందరూ తమకు మంచి పోస్టింగ్ దక్కాలని కోరుకుంటున్నారు.
ఏ ప్రభుత్వమైనా...
కానీ అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం తమకు అనుకూలురైన అధికారులను నియమించుకుంటుంది. అయితే కొన్ని సిఫార్సులు కూడా పనిచేసే అవకాశముంది. కూటమిగా ఉండటంతో కొందరు ఆ పార్టీ నేతల వద్దకు వెళ్లి తమ గోడును వెళ్లబోసుకుంటున్నట్లు తెలిసింది. తమకు ఈ పోస్టు వచ్చేలా చూడాలని కూటమి పార్టీలోని అగ్రనేతల ముందు ఒక ప్రతిపాదన అయితే పెట్టి వస్తున్నారు. ఆ ప్రతిపాదన వర్క్ అవుట్ అవుతుందా? లేదా? పక్కన పెడితే జరిగితే మంచిదేగా? అన్న రీతిలో సాగుతుంది. అయితే అనుభవం ఉన్న చంద్రబాబుకు కీలక పోస్టులలో ఎవరిని నియమించాలో తెలుసు. టీటీడీ ఈవోతో పాటు శాంతి భద్రతలను కాపాడేందుకు తనకు అత్యం నమ్మకమైన, ఇష్టమైన అధికారులకే అవకాశం ఆయన ఇస్తారన్నది కూడా అంతే సత్యం. కానీ ఏదో ఒక ఆశతో కాస్త బలమైన నేత సిఫార్సు ఉంటే తమ పని అయిపోతుందని భావించి అధికారులు నేతల ఇళ్ల వద్దకు క్యూ కడుతున్నారు.