చంద్రబాబుకి బ్రహ్మరథం.. తెలుగు తమ్ముళ్లలో కొత్త జోష్

తెలుగుదేశం అధినేత చంద్రబాబుకి ఉత్తరాంధ్రలో బ్రహ్మరథం పట్టారు. అధినేత పర్యటనతో తమ్ముళ్ల కొత్త జోష్ కనిపిస్తోంది.

Update: 2022-05-06 12:06 GMT

గత ఎన్నికల్లో ఘోర ఓటమితో చతికిలపడ్డ తెలుగు దేశం పార్టీ క్రమంగా పుంజుకుంటోంది. టీడీపీ పోరాటం కంటే ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత ఆ పార్టీకి బాగా కలసి వస్తోంది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుండడం అందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన సందర్భంగా ఈ మూడేళ్లలో ఎన్నడూ లేనంతగా తెలుగు తమ్ముళ్లలో జోష్ కనిపించింది. ఉత్సాహంగా పాల్గొని అధినేత పర్యటనను విజయవంతం చేశారు.

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనూ చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. ఈరోజు ఉదయం అన్నవరం నుంచి బయలుదేరిన అధినేతకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు తెలుగు తమ్ముళ్లు. ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవులో తలపెట్టిన బాదుడే బాదుడు కార్యక్రమానికి బయలుదేరిన చంద్రబాబుకి రోడ్డు పొడవునా నేతలు ఘన స్వాగతం చెప్పారు. పసుపు జెండాలు.. క్రేన్లతో భారీ దండలతో అధినేతకు ఎదురొచ్చి స్వాగతించారు.

కాకినాడ భానుగుడి సెంటర్‌లో రోడ్‌ షోకు భారీగా జనం తరలివచ్చారు. రోడ్‌ షోలో ఆయన మాట్లాడుతూ జగన్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. గంజాయి, జే బ్రాండ్ల మద్యం వల్లే రాష్ట్రంలో ఆడబిడ్డలపై అరాచకాలు పెరిగిపోతున్నాయని ఆయన మండిపడ్డారు. పిల్లలు గంజాయికి బానిసలైతే తట్టుకోగలమా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి దొరుకుతోందని.. యువత అలవాటుపడి తమ జీవితాలను నాశనం చేసుకుంటోందన్నారు. జగన్ సర్కార్ అసమర్ధత వల్లే దారుణాలు జరుగుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనకాపల్లిలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేశారని.. నిందితుడు గంజాయి విక్రయిస్తూ జైలుకి వెళ్లొచ్చిన వ్యక్తని చంద్రబాబు అన్నారు. అలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. అసమర్థ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఇంటికొకరు ముందుకు రావాలన్నారు. తాను ముందుండి నడిపిస్తానని.. తనతో వచ్చేందుకు సిద్ధమేనా అని ప్రజలను ప్రశ్నించారు. అందరం కలిసి ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని గద్దె దించుదామని.. శాశ్వతంగా రాజకీయాల్లో లేకుండా చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.  

Tags:    

Similar News