భక్తులకు షాక్.. కృష్ణానదిలో దుర్గమ్మ తెప్పోత్సవం రద్దు ?

ప్రకాశం బ్యారేజీలో 30 వేల క్యూసెక్కుల లోపు నీరు ఉంటేనే తెప్పోత్సవం సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో.. అమ్మవారి ..

Update: 2022-10-03 13:28 GMT

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శరన్నవరాత్రులు కన్నుల పండువగా జరుగుతున్నాయి. రాత్రి సమయంలో కళ్లు మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాలంకరణ భక్తులను ఆకట్టుకుంటోంది. వేకువజామునుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. నేడు అమ్మవారు దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

కాగా.. ప్రతి ఏటా విజయదశమి రోజున కనకదుర్గమ్మ తల్లిని రాజరాజేశ్వరి దేవిగా అలంకరించి కృష్ణానదిలో తెప్పోత్సవం, హంసవాహన సేవ నిర్వహిస్తారు. ఈ వేడుక చూసేందుకు రెండు కళ్లూ చాలవు. కన్నులారా వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు. కానీ ఈ ఏడాది తెప్పోత్సవం రద్దంటూ భక్తులకు షాకిచ్చింది సమన్వయ కమిటి. అందుకు కారణం వరద ఎక్కువగా ఉండటమే.
పులిచింతల ప్రాజెక్టు నుంచి విజయవాడ ప్రకాశం బ్యారేజీకి లక్ష క్యూసెక్కులకు పైగా వరద నీరు వస్తోంది. ప్రకాశం బ్యారేజీలో 30 వేల క్యూసెక్కుల లోపు నీరు ఉంటేనే తెప్పోత్సవం సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో.. అమ్మవారి తెప్పోత్సవంపై సందిగ్ధత నెలకొంది. అమ్మవారి జలవిహారంపై రేపు అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం కానుంది. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ, దుర్గమ్మ తెప్పోత్సవానికి జలవనరుల శాఖ నుంచి ఇంకా అనుమతి రాలేదని వెల్లడించారు. దసరా రోజున వరద ప్రవాహం ఎక్కువగా ఉంటే హంస వాహనాన్ని స్థిరంగా ఉంచి ఉత్సవాన్ని నిర్వహించే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు.


Tags:    

Similar News