జగన్ ఆస్తుల కేసులు.. ఎన్నికల లోపు పూర్తీ చేయాలంటూ!!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆస్తుల కేసులపై తెలంగాణ హైకోర్టు

Update: 2023-12-15 11:15 GMT

investigation of the cases registered against Jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆస్తుల కేసులపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. మాజీ ఎంపీ హరిరామజోగయ్య ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయగా.. దీనికి సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇప్పటికే వైఎస్ జగన్ కు, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ప్రతివాదులకు ఇప్పటికీ నోటీసులు అందలేదు. ప్రజాప్రతినిధుల కేసులను త్వరగా విచారించాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు ప్రజాప్రతినిధుల కేసులను సుమోటో పిల్ రూపంలో విచారిస్తోంది. ఈ ప్రజాప్రతినిధుల కేసుల సుమోటో పిల్ ను, జగన్ కేసులపై దాఖలైన పిల్ తో జతపరచాలని కోర్టు రిజిస్ట్రార్ కు ఆదేశాలు జారీ చేసింది. జగన్ మోహన్ రెడ్డిపై నమోదైన కేసుల విచారణను ఎన్నికల లోపు పూర్తి చేయాలని హరిరామజోగయ్య తన పిటిషన్ లో కోరారు. ఇంకా 20 కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని.. దీనిపై సీబీఐ తరఫు న్యాయవాది స్పందిస్తూ, డిశ్చార్జి పిటిషన్ల పెండింగ్ పై సీబీఐ కోర్టులో మెన్షన్ చేసినట్టు తెలంగాణ హైకోర్టుకు తెలిపారు. వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు డిశ్చార్జి పిటిషన్లపై రెండు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను మూడు నెలలకు వాయిదా వేసింది.

జగన్‌పై నమోదైన సీబీఐ, ఈడీ కేసులను రోజువారీ విచారణ చేపట్టి తేల్చేసేలా హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు ఆదేశాలివ్వాలంటూ హరిరామజోగయ్య తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పిల్ దాఖలు చేశారు.. సీబీఐ, ఈడీ కేసులు లేని నేతను ఎన్నుకోవాలని ప్రజలు అనుకుంటున్నారని.. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసుల్లో నిందితుడైన జగన్‌ వరుస పిటిషన్లు వేసి విచారణలో జాప్యం చేస్తున్నారన్నారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నా.. ఎమ్మెల్యేగా ఎన్నికై ముఖ్యమంత్రి అయ్యారని పిల్‌లో ప్రస్తావించారు.


Tags:    

Similar News