ఏపీలో భానుడి భగభగలు.. నిప్పుల వాన కురిపిస్తున్న సూరీడు
రాష్ట్రంలో సూరీడు నిప్పులవాన కురిపిస్తున్నట్లు కనిపిస్తోంది. కొద్దిరోజులుగా రాష్ట్రంలో 42 నుంచి 47 డిగ్రీల వరకూ..
అమరావతి : ఏపీలో భానుడు భగభగ మండిపోతున్నాడు. తీవ్రమైన ఉక్కపోత, వడగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. చూస్తుంటే.. రాష్ట్రంలో సూరీడు నిప్పులవాన కురిపిస్తున్నట్లు కనిపిస్తోంది. కొద్దిరోజులుగా రాష్ట్రంలో 42 నుంచి 47 డిగ్రీల వరకూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన ఎండలకు భయపడి ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు. వడగాలుల తీవ్రతకు చాలా చోట్ల ప్రజలు సొమ్మసిల్లి పడిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా 21 మండలాల్లో నిన్న వడగాలులు వీచినట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
రాష్ట్రంలోని తణుకు, తాడేపల్లిగూడెం, ఇబ్రహీంపట్నం, ఉండ్రాజవరంలో 44.8 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత నమోదైంది. నేడు కూడా కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 84 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అలాగే.. కోస్తా, రాయలసీమల్లో నేడు అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.