హెచ్చరిక.. నేడు ఈ జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు
ఏలూరు జిల్లా కుకునూర్, వేలేరుపాడు మండలాలతో పాటు మరో 212 మండలాల్లోనూ తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని, ప్రజలు జాగ్రత్తగా..
కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాలు నిప్పులకొలిమిని తలపిస్తున్నాయి. రాత్రివేళ వర్షం కురిసినా.. పగటి ఉష్ణోగ్రతలు మాత్రం తగ్గటం లేదు. 40 నుండి 43 డిగ్రీల వరకూ ఎండలు కాస్తున్నాయి. ఎండలకు తోడు ఉక్కపోత కూడా విపరీతంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు వీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో మరో మూడురోజుల పాటు ఎండ మంటలు మండిస్తుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నేడు అల్లూరి జిల్లా నెలిపాక, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశాలున్నాయని వెల్లడించింది.
అలాగే ఏలూరు జిల్లా కుకునూర్, వేలేరుపాడు మండలాలతో పాటు మరో 212 మండలాల్లోనూ తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఇదే సమయంలో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చని తెలిపింది. నిన్న ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో అత్యధికంగా 43.3 డిగ్రీలు, ఏలూరు జిల్లా శ్రీరామవరంలో 43.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నేడు అల్లూరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుండి 47 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 నుండి 44 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నట్లు తెలిపింది.
ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C - 44°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విశాఖపట్నం, అనకాపల్లి, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 39°C - 41°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్న నేపథ్యంలో.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే తప్ప పిల్లల్ని బయటకు తీసుకురావొద్దని హెచ్చరించింది. అలాగే మజ్జిగ, కొబ్బరినీరు, నిమ్మరసాలతో పాటు అధికంగా మంచినీరు తాగాలని సూచించింది.