దూసుకొస్తోన్న అసని తుఫాను.. రేపట్నుంచి ఏపీలో వర్షాలు ?
అసని తుపాను ప్రభావంతో రేపట్నుంచి ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పుగోదావరి, కోనసీమ..
అమరావతి : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం ఉదయానికి వాయుగుండంగా మారినట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేడు వాయుగుండం తీవ్ర వాయుగుండంగా.. ఆ తర్వాత తుపానుగా మారుతుందని తెలిపింది. తుపాను మరింత వేగంగా ప్రయాణించి.. సోమవారానికి కోస్తాంధ్ర-ఒడిశా తీరాలకు దగ్గరగా వస్తుందని స్పష్టం చేసింది. ఈ తుపానుకు అసనిగా నామకరణం చేశారు. ఈనెల 10వ తేదీకి అసని తుపాను ఉత్తర కోస్తాంధ్ర- ఒడిశా తీరానికి దగ్గరగా వచ్చి తీరం దాటవచ్చని, లేదా తిరిగి దిశమార్చుకుని ఈశాన్యం వైపు వెళ్లే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
అసని తుపాను ప్రభావంతో రేపట్నుంచి ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలతో పాటు.. ఉత్తర కోస్తాంధ్రలో ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వెల్లడించింది. వాయుగుండం, తుపాను కారణంగా.. కోస్తాంధ్ర తీరంవెంబడి 40 నుంచి 50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీయడంతో పాటు.. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉంటుందని, మత్స్యకారులెవరూ సముద్రంలో వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోనూ మంగళవారం నుంచి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షసూచన నేపథ్యంలో రైతులు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.