తెలుగు రాష్ట్రాలకు మూడ్రోజులు భారీ వర్షసూచన.. రానున్న 24 గంటలు కీలకం
పశ్చిమ విదర్భ నుంచి మరఠ్వాడా, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకూ సగటు సముద్ర మట్టం..
తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశంలో వివిధ రాష్ట్రాల్లో అకాల వర్షాలు రైతుల కంట కడగండ్లుగా మారాయి. ఆరుగాలం కష్టపడిన రైతుకి.. పంట చేతికి వస్తుందనుకుంటున్న క్రమంలో నడివేసవిలో వచ్చిన అకాల వర్షాలు పంటలను నాశనం చేశాయి. మామిడి, వరి, మొక్కజొన్న, అరటి పంటల రైతులను నిలువారా ముంచేశాయి. కాగా.. తాజాగా వాతావరణశాఖ రానున్న మూడ్రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో రానున్న 24 గంటల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు వివరించారు.
పశ్చిమ విదర్భ నుంచి మరఠ్వాడా, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకూ సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తున ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో.. వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అలాగే దక్షిణ కోస్తాలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. రానున్న మూడ్రోజుల్లో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక రాష్ట్రాల్లో ఉరుములు, వడగళ్లతో కూడిన భారీ వర్షాలతో పాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. అలాగే ఢిల్లీ పంజాబ్, రాజస్థాన్, హరియాణా, మధ్యప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. భారీ వర్షసూచన నేపథ్యంలో.. ప్రజలు, రైతులు, గొర్రె కాపరులెవరూ చెట్ల కింద నిలబడొద్దని హెచ్చరించింది.