తిరుమలలో కుండపోత వర్షాలు..శ్రీవారిమెట్టుమార్గం మూసివేత, ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు

పాపనాశనం, శిలాతోరణం మార్గాలను సైతం మూసివేసింది. తిరుమలలోని అన్ని జలాశయాల్లో నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరింది.

Update: 2022-12-10 14:13 GMT

మాండూస్ తుపాను తీరం దాటి వాయుగుండంగా బలహీన పడింది. మాండూస్ ప్రభావంతో నిన్నటి నుండీ తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. తిరుమల కొండపై కురుస్తున్న ఎడతెరపిలేని వర్షానికి.. ఓ భారీ వృక్షం కూలిపోయి భక్తురాలికి గాయాలయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రత అధికంగా ఉండడంతో దర్శనం అనంతరం భక్తులు కొండ నుంచి తిరుగు పయనమవుతున్నారు. అటు శ్రీవారి మెట్టు మార్గంలో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో, టీటీడీ అప్రమత్తం అయింది. కొండచరియలు విరిగిపడే ప్రాంతాల్లో భక్తుల రాకపోకలను నిలిపివేసింది. శ్రీవారిమెట్టు మార్గాన్ని తాత్కాలికంగా మూసివేసింది.

పాపనాశనం, శిలాతోరణం మార్గాలను సైతం మూసివేసింది. తిరుమలలోని అన్ని జలాశయాల్లో నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరింది. ఈ రాత్రికి కూడా ఇదే పరిస్థితి కొనసాగితే.. 2021 పరిస్థితి వస్తుందని భక్తులు భయపడుతున్నారు. అటు చెన్నైలోనూ కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ జలమయమై.. నదులను, చెరువులను తలపిస్తున్నాయి. ప్రజలు ఇళ్లనుండి బయటకు రావొద్దని, చలితీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో.. చిన్నారులు, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలని అధికారులు సూచించారు.

కాగా..నేడు, రేపు ఏపీలోని ఐదు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. కృష్ణ, బాపట్ల, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో కుండపోత వర్షాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రేపటి వరకూ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. భారీవర్షాల ధాటికి.. ఇప్పటికే చేతికి అందివచ్చిన పంట నీటమునిగిందంటూ రైతులు వాపోతున్నారు. కోతలు కోసి ఉంచిన పంటంతా వర్షార్పణమైందని, ఇలాంటి తుపానుల వల్ల రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోందని రైతాంగం వాపోతోంది.




Tags:    

Similar News