కుప్పం చుట్టుపక్కల ప్రాంతాలను వణికిస్తున్న ఏనుగులు
చిత్తూరు జిల్లా కుప్పానికి ఏనుగుల ప్రమాదం పొంచి ఉంది
చిత్తూరు జిల్లా కుప్పానికి ఏనుగుల ప్రమాదం పొంచి ఉంది. తమిళనాడు రాష్ట్రం హోసూర్ నుంచి కుప్పం వైపు 70 ఏనుగుల గుంపు తరలివస్తోంది. రాత్రి తమిళనాడు హోసూరు సరిహద్దులో 70 ఏనుగుల గుంపు కనిపించింది. దీంతో కుప్పం సరిహద్దు గ్రామాల్లో అటవీశాఖ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. గ్రామ సరిహద్దుల్లో, పొలాల్లో రాత్రి పూట ప్రజలు ఉండకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కుప్పం అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
ఏనుగుల కారణంగా గత కొద్ది రోజుల నుంచి రైతులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. పలు ప్రాంతాల్లో పంటలు నాశనం చేస్తున్నాయి. పంటలు ధ్వంసం చేస్తున్నా ఏనుగుల గుంపును తరిమే ప్రక్రియ చేపట్టలేదంటున్నారు. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. వికోట మండలంలో 13 ఏనుగుల గుంపు ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం పంటలను ధ్వంసం చేశాయి. కృష్ణాపురం, మోట్లపల్లి, జవునిపల్లి, మిట్టూరు తదితర గ్రామాల సమీప పంటపొలాల్లోకి ప్రవేశించి నాశనం చేస్తున్నాయి. కూరగాయల పంటలను ధ్వంసం చేశాయి.