Rain Alert: హై అలర్ట్.. మరింత బలపడిన అల్పపీడనం
ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో
ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడిందని భారత వాతావరణ సంస్థ తెలిపింది. ఈ తీవ్ర అల్పపీడనం రాగల 36 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో ఆగస్టు 31, సెప్టెంబరు 1న మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) తెలిపింది. రేపు తీర ప్రాంతాల్లో 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశముందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.
అరేబియా సముద్రంలో:
శుక్రవారం గుజరాత్‌లో కుండపోత వర్షాలు కురవడమే కాకుండా భారీగా వరదలు సంభవించాయి. అందుకు కారణం అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను. అల్పపీడనం కారణంగా కచ్ఛ్ తీరం, పాకిస్తాన్ పరిసర ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాను అస్నాగా మారిందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. 1976 తర్వాత ఆగస్ట్ నెలలో అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను ఇదే తొలిసారి. ఆస్నా పేరును పాకిస్థాన్ పెట్టింది. IMD ప్రకారం, 1891, 2023 మధ్య, ఆగస్టులో (1976, 1964 మరియు 1944లో) అరేబియా సముద్రంలో కేవలం మూడు తుఫానులు మాత్రమే ఏర్పడ్డాయి.
1976 లో తుఫాను ఒడిశా మీదుగా ఉద్భవించింది, పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి, అరేబియా సముద్రంలోకి ప్రవేశించి, ఒమన్ తీరానికి సమీపంలో వాయువ్య అరేబియా సముద్రం మీద బలహీనపడింది. 1944 తుఫాను అరేబియా సముద్రంలో ఉద్భవించిన తర్వాత తీవ్రమైంది. 1964లో, దక్షిణ గుజరాత్ తీరానికి సమీపంలో మరో స్వల్పక తుఫాను అభివృద్ధి చెందింది. తీరానికి సమీపంలో బలహీనపడింది.