అమరావతి రైతులకు బిగ్ షాక్

ఆర్-5 జోన్ పై ప్రభుత్వానికి హైకోర్టు అనుకూలంగా తీర్పు చెప్పింది. అమరావతి రైతులు రేపు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు;

Update: 2023-05-05 12:56 GMT

ఆర్-5 జోన్ పై ప్రభుత్వానికి హైకోర్టు అనుకూలంగా తీర్పు చెప్పింది. జీవో నెంబర్ 45పై మధ్యంతర ఉత్తర్వులివ్వాలంటూ దాఖలైన పిటిషన్ కొట్టివేసింది. ఇళ్ల స్థలాల పంపిణీ కోర్టు తీర్పుకు లోబడి ఉండాలన్న ధర్మాసనం పేర్కొంది. పిటిషన్ విచారణ సందర్భంగా సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని ఏ ఒక్కరికో పరిమితం కాదని వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతి ప్రజలందరిది అని చీఫ్ జస్టిస్ కామెంట్స్ చేశారు. రాజధానిలో పేదలు ఉండకూడదంటే ఎలా అన్న చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం అభివృద్ధిలో భాగమేనని ధర్మాసనం అభిప్రాయపడింది.

కేటాయించవద్దంటే ఎలా?
ఫలానా వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని చెప్పడం కరెక్ట్ కాదని తెలిపింది. రాజధాని భూములు ప్రస్తుతం సీఆర్డీఏవే.. భూములు ఇచ్చిన వారివి కావని కూడా స్పష్టం చేసింది. - ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంపైనా కోర్టును ఆశ్రయిస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. రాజధాని విషయంలో కొన్ని అంశాలు హైకోర్టులో.. కొన్ని అంశాలు సుప్రీంకోర్టులో సవాల్ చేశారని, నిర్ణయాలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నిరోధించలేమని ధర్మాసనం పేర్కొంది. నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వ విధుల్లో భాగమని చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా పేర్కొన్నారు. అయితే దీనిపై రేపు సుప్రీంకోర్టును అమరావతి రాజధాని రైతులు ఆశ్రయించనున్నారు. స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు.


Tags:    

Similar News