తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు.. మరో రెండ్రోజులు వడగాలులు

ఉదయం 8 గంటలైనా కాకుండా.. ఉక్కపోత మొదలవుతోంది. పగటి ఉష్ణోగ్రతలతో పాటు.. రాత్రి ఉష్ణోగ్రతలూ పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి

Update: 2022-03-31 04:52 GMT

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ ఎండలు తీవ్రమవుతున్నాయి. భానుడి భగభగలకు ప్రజలు మలమలా మాడిపోతున్నారు. మండే ఎండల్లో పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. వేసవి ఆరంభంలోనే ఇలా ఉంటే.. ముందు ముందు పగటి ఉష్ణోగ్రతలు ఏ స్థాయిలో ఉంటాయోనని భయపడుతున్నారు ప్రజలు. ఉదయం 8 గంటలైనా కాకుండా.. ఉక్కపోత మొదలవుతోంది. పగటి ఉష్ణోగ్రతలతో పాటు.. రాత్రి ఉష్ణోగ్రతలూ పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మండుటెండలకు తోడు పలు ప్రాంతాల్లో వడగాలులు వీస్తున్నాయి. దాంతో బయటికి రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు.

హైదరాబాద్ లో బుధవారం సాధారణం కంటే 3.5 డిగ్రీలు అధికంగా 40.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్ లో 42.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవగా నల్గొండ, నిజామాబాద్, రామగుండంలో 41 డిగ్రీలు, మహబూబ్ నగర్, మెదక్ లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్ర, శని వారాలలో తెలుగు రాష్ట్రాలలో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. విదర్భ నుంచి కేరళ వరకూ గాలులతో ఉపరితల ద్రోణి 900 మీటర్ల ఎత్తున కొనసాగుతున్న కారణంగా ఎండల తీవ్రత పెరుగుతోంది.


Tags:    

Similar News