తిరుపతిలో భవనాలకు ప్రమాదం.. కూల్చివేయాలని నిర్ణయం
భారీ వర్షాలకు తిరుపతిలో ఇళ్లు కూలుతున్నాయి. పాత భవనం కుప్పకూలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
భారీ వర్షాలకు తిరుపతిలో ఇళ్లు కూలుతున్నాయి. పాత భవనం కుప్పకూలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పాత భవనాలను గుర్తించి వారికి నోటీసులు ఇచ్చారు. దాదాపు 140 ఇళ్లకు అధికారులు నోటీసులు ఇచ్చారు. కృష్ణానగర్ లోని ఒక పాత భవనాన్ని కూల్చివేయాలని నిర్ణయించారు. గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తిరుపతి నగరం అతలాకుతలం అవుతుంది. పురాతన భవనాలు కూలిపోతున్నాయి.
ఇప్పటికే నోటీసులు....
ప్రాణ నష్టం ఉండకూడదని భావించిన అధికారులు పురాతన భవనాలను గుర్తించి వాటిని ఖాళీ చేయించారు. వాటిని కూల్చివేయాలని నోటీసులు ఇచ్చారు. గుర్తించిన 140 భవనాల్లో 28 భవనాలను వెంటనే కూల్చి వేయాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. తమంతట తాము కూల్చివేయకపోతే తామే కూల్చివేస్తామని చెబుతున్నారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉండటంతో భవనాలను కూల్చివేతకు అధికారులు సిద్ధమయ్యారు. తిరుపతిలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్ లలోనూ అధికారులు చర్యలు చేపట్టారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో రాకపోకలను నిలిపివేశారు.