తెలుగు రాష్ట్రాలను కలుపుతూ కృష్ణానదిపై ఐకానిక్ వంతెన
ఉభయ తెలుగు రాష్ట్రాల నడుమ కృష్ణా నదిపై రూ.1,082.56 కోట్ల వ్యయంతో ఐకానిక్ తీగల వంతెనను నిర్మించేందుకు..
ఏపీ - తెలంగాణలను కలుపుతూ కృష్ణానదిపై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జిని నిర్మించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నడుమ కృష్ణా నదిపై రూ.1,082.56 కోట్ల వ్యయంతో ఐకానిక్ తీగల వంతెనను నిర్మించేందుకు ఆమోదం తెలిపినట్టు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. సిద్దేశ్వరం - సోమశిల మధ్య ఈ నిర్మాణం 30 నెలల్లో పూర్తవుతుందని ఆయన తెలిపారు.
శ్రీశైలం జలాశయానికి చేరువగా.. నల్లమల అడవి, ఎత్తయిన కొండల మధ్య నిర్మించే ఈ వంతెన.. పర్యాటకులను ఆకర్షిస్తుందని గడ్కరీ తెలిపారు. తెలంగాణ వైపు ఉన్న లలితా సోమేశ్వర ఆలయం, ఏపీ వైపు ఉన్న సంగమేశ్వర ఆలయాలతో ఈ కేబుల్ బ్రిడ్జి ఒక ఆకర్షణీయ కేంద్రంగా మారుతుందని నితిన్ గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు.