Andhra Pradesh : ఇంకా ఎంత కాలం జగన్ పై నెపం నెడతారు?

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కావస్తుంది. మంత్రి వర్గం ఏర్పడింది. అధికారుల బదిలీలు జరిగాయి

Update: 2024-08-23 12:08 GMT

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కావస్తుంది. మంత్రి వర్గం ఏర్పడింది. అధికారుల బదిలీలు జరిగాయి. పాలన అంతా ప్రారంభమయింది. అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు అనేక ప్రణాళికలను రచిస్తున్నారు. అయితే ఇప్పుడు ఏం జరిగినా అది జగన్ ప్రభుత్వంలో జరిగిన లోపాల వల్లనేనంటూ చెప్పడం ముఖ్యమంత్రి చంద్రబాబు వంతయింది. జగన్ వ్యవస్థలను నాశనం చేశాడని, ఒక్కోదాన్ని సరిచేసుకుంటూ వెళుతున్నామని చెబుతున్నారు. అయితే అధికారంలో ఉన్న పార్టీ ఇంకా ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేస్తూ గత ప్రభుత్వం చేసిన నిర్వాకం అంటూ నెపాన్ని నెట్టేందుకు ప్రయత్నం చేస్తుంటే ప్రజలు ఏ మేరకు హర్షిస్తారన్న ప్రశ్న తలెత్తుతుంది.

అచ్యుతాపురంలో....
అచ్యుతాపురంలో ఫార్మా కంపెనీలో పదిహేడు మంది చనిపోతే దానికి కారణం కూడా జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యమేనంటూ గత ఐదేళ్లలో ప్రమాదంలో జరిగిన మృతుల సంఖ్యను చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రమాదం జరిగింది కూటమి ప్రభుత్వ హయాంలోనే. చంద్రబాబు అన్ని శాఖలను సమీక్ష చేస్తూ వెళుతున్నారు. అయితే యాజమాన్యం తప్పును పక్కన పెట్టి గత ప్రభుత్వ వైఫల్యమంటూ చెప్పడం ఎంతవరకూ సమంజసమన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. అచ్యుతాపురం ఘటన తర్వాత మరో ఫార్మా కంపెనీలోనూ ప్రమాదం జరిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
పంచాయతీ రాజ్ వ్యవస్థను...
ఇక పంచాయతీరాజ్ వ్యవస్థను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని నేడు కూడా గ్రామ సభల్లో చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే అభివృద్ధి పనుల ప్రస్తావన లేకుండా గత ప్రభుత్వంపై తప్పులు రుద్దే ప్రయత్నించడం తప్పించుకునేందుకేనన్న కామెంట్స్ వినపడుతున్నాయి. జగన్ తప్పలు చేస్తేనే కదా? కేవలం ఆ పార్టీకి పదకొండు స్థానాలను ప్రజలు కట్టబెట్టింది. ఈ చిన్న లాజిక్ ను మర్చి పోయి చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు గత ప్రభుత్వంపై నిందలు మోపడాన్ని ప్రజలు పాజిటివ్ గా తీసుకునే అవకాశం లేదు.
ఇచ్చిన హామీలు...
ఎన్నికల ప్రచారంలో తొలుత కూటమి పార్టీలు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రతి అంశాన్ని జగన్ పై రుద్దడం ఎంత వరకూ సబబని ప్రశ్నలు వినవస్తున్నాయి. ఇంకా ఎంతకాలం ఇలా జగన్ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తారంటూ అనేక మంది సోషల్ మీడియాలో ప్రశ్నించడం కనిపిస్తుంది. నిజానికి మూడు నెలల తర్వాత తాము ఇచ్చిన హామీల అమలు గురించి ప్రస్తావించకుండా గత ప్రభుత్వ వైఫల్యాలంటూ నెడితే అది ప్రస్తుత ప్రభుత్వానికి సానుకూలత ఫలితం ఉండదన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి. డైవర్ట్ రాజకీయాలంటూ పోస్టులు కనిపిస్తున్నాయి.


Tags:    

Similar News