Andhra pradesh : ఏపీ ఎన్నికలకు కసరత్తు.. కేంద్ర ఎన్నికల సంఘం రాక?
ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తులు ప్రారంభించింది
ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తులు ప్రారంభించింది. అందులో భాగంగా త్వరితగతంగా ఎన్నికలను నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలియవచ్చింది. అనుకున్న సమయం కంటే ముందుగానే ఏపీలో ఎన్నికలు వచ్చే అవకాశముందని రాజకీయ పార్టీల నేతలు కూడా సంకేతలు ఇస్తుండటం ఇందుకు ఉదాహరణ. ఓటర్ల జాబితాను కూడా త్వరగానే ఫైనల్ చేయనుంది. దీంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా ఏపీకి వచ్చి ఎన్నికలకు సంబంధించి ఇక్కడి అధికారులతో సమావేశం కానున్నారని తెలిసింది.
రెండు రోజుల పాటు...
ఈ నెల 22, 23 తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల బృందం ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనుందని తెలిసింది. 21వ తేదీన సాయంత్రం విజయవాడకు చేరుకోనున్న ఎన్నికల సంఘం అధికారులు ఈ 23న జిల్లా కలెక్టర్లు, పోలీస్ సూపరింటెండెంట్లతో పాటు ముఖ్య అధికారులతో సమావేశం కానున్నారని తెలిసింది. జిల్లాలకు సంబంధించిన ఓటర్ల జాబితాతో పాటు ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు, సున్నితమైన పోలింగ్ కేంద్రాలు వంటి విషయాలపై ఉన్నతాధికారులతో చర్చించనున్నట్లు తెలిసింది. దీంతో ఎన్నికలు అనుకున్న సమయం కంటే ముందుగానే వచ్చే అవకాశాలున్నాయని అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.