ఏపీ వాసులకు గుడ్ న్యూస్... కంది పప్పు, చక్కెర ధరలు ఇక చౌకగానే?
ఆంధ్రప్రదేశ్ లో కందిపపప్పు, చక్కెర ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ లో కందిపపప్పు, చక్కెర ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దసరా పండగ సమీపిస్తున్న తరుణంలో ప్రజలకు మరింతగా ఈ రెండు వస్తువులను చౌకగా అందించేందుకు సిద్ధం చేసింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తగ్గింపు ధరలపై ప్రకటన చేశారు. నిత్యావసరధరలు పెరిగిపోతుండటంతో పాటు పండగ సీజన్ ప్రారంభం కానుండటంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడకూడదని కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బహిరంగ మార్కెట్ లో దొరికే ధరలకన్నా తగ్గించి రేషన్ దుకాణాల్లో విక్రయించాలని నిర్ణయించారు. బయట మార్కెట్ లో కేజీ కంది పప్పు ధర 180 రూపాయల వరకూ విక్రయిస్తున్నారు. ఈ ధరలను తగ్గించడం ద్వారా పేదలు పండగను సంబరంగా చేసుకునే వీలును ప్రభుత్వం కల్పించింది.
4.32 కోట్ల మందికి లబ్ది...
కిలో చక్కెర యాభై రూపాయల వరకూ పలుకుతుంది. సామాన్య ప్రజలు వీటిని కొనుగోలు చేయలేని పరిస్థిితికి వచ్చిందని భావించిన ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో అతి తక్కువ ధరలకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రేషన్ దుకాణాల్లో ప్రస్తుతం 160 రూపాయలు కిలో కందిపుప్పు ఉన్న ధరను మరో పది రూపాయలు తగ్గించి నూట యాభై రూపాయలకే అందించాలని నిర్ణయించారు. ఇక కిలో చక్కెరను 34 రూపాయలకే అందించేందుకు సిద్ధమ్యారు. ఈరోజు తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా చక్కెర, కందిపప్పు ను పంపిణీ చేయనున్నారు. దీనివల్ల రాష్ట్రంలోని 1.49 కోట్ల మంది రేషన్ కార్డుదారులు లబ్ది పొందనున్నారు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 29,811 రేషన్ దుకాణాల ద్వారా అందచేయనున్నారు. ఈ పంపిణీతో దాదాపు 4.32 లక్షల మంది లబ్ది పొందనున్నారని అధికార వర్గాలు తెలిపాయి.