Andhra Pradesh : రేషన్ కార్డుల్లో ఇంతమంది బోగస్సా... అంతా మాయాజాలమేనా?

ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డులను ప్రభుత్వం ఆదేశాలతో సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు. బోగస్ లబ్దిదారుల ఏరివేత ప్రారంభమయింది

Update: 2024-12-09 06:46 GMT

ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డులను ప్రభుత్వం ఆదేశాలతో సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు. అనర్హులు రేషన్ కార్డులను పొందారన్న ఆరోపణలపై నిన్నటి నుంచి ఈ రేషన్ కార్డుల ఏరివేత కార్యక్రమం ప్రారంభమయింది. ఒక ప్రాంతంలో పనిచేసే సిబ్బందిని మరొక ప్రాంతంలోకి పంపి రేషన్ కార్డులను తనిఖీ చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో దివ్యాంగులతో పాటు అనేక కేటగిరీలలో రేషన్ కార్డులను కూడా అనర్హులకు కేటాయించారన్న ఆరోపణలపై ప్రభుత్వం ఈ ఆకస్మిక తనిఖీలను చేపట్టింది. కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయాలన్న ఉద్దేశ్యంతో ఉన్న ఏపీ సర్కార్ ముందుగా అనర్హులను గుర్తించి ఏరివేసే కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇంటింటికి వెళ్లి తనిఖీలను చేపట్టింది.

రేపు కూడా తనిఖీలు...
ఆంధ్రప్రదేశ్ లో రేపు కూడా తినిఖీలను సిబ్బంది చేపట్టనున్నారు. పక్క మండలాల నుంచి సిబ్బందిని రప్పించి తనిఖీలు చేయిస్తుండటంతో వాస్తవాలు బయటకు వస్తాయని ప్రభుత్వం భావిస్తుంది. అనర్హులని భావించిన లబ్దిదారుల రేషన్ కార్డులను నిర్దాక్షిణ్యంగా తొలగించాలని, అర్హులైన వారికి మాత్రం అన్యాయం చేయకుండా ఉండేలా తనిఖీలు చేయాలని సిబ్బందికి ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సిబ్బంది రేషన్ కార్డులు తనిఖీ చేస్తున్నారు. తెలుపు రంగు రేషన్ కార్డు ఉంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలను అన్నీ అందుతాయి. అందుకే అనర్హులను తొలగించి నిజమైన పేదలకు న్యాయం చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం పట్టకుండా ఉండేలా ఈ చర్యలకు ఉపక్రమించింది.
యాభై ఆరు లక్షల మంది...
ఆంధ్రప్రదేశ్ లో కోటి అరవై లక్షల మంది వరకూ రేషన్ కార్డుదారులున్నారు. అయితే వీరిలో దాదాపు యాభై ఆరు లక్షల మంది వరకూ అనర్హులుగా ఉన్నట్లు సమాచారం అందడంతో ఇంత పెద్దయెత్తున అనర్హులను గత ప్రభుత్వం లబ్దిదారులుగా చేర్చిందని ప్రభుత్వం భావిస్తుంది. తెలుపు రంగు రేషన్ కార్డులున్న వారిలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఆదాయపు పన్ను చెల్లించే వారు కూడా ఉన్నట్లు ఫిర్యాదులొచ్చాయి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులతో పాటు రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు కూడా ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. కొత్తగా రేషన్ కార్డులను త్వరలో మంజూరు చేయడంలో భాగంగా ఈ ప్రక్రియను చేపట్టినట్లు సిబ్బంది ప్రజలకు చెబుతున్నా అది ఏరివేతకేనని తెలుస్తుంది. మొత్తం మీద అనర్హులను ఏరివేసే కార్యక్రమం ఏపీలో ప్రారంభమయింది.


ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App Now

Tags:    

Similar News