శ్రీవారి భక్తులకు గమనిక: 3 నుంచి సేవల రద్దు
తిరుమల తిరుపతి దేవస్థానంలో వచ్చే నెల మూడో తేదీ నుంచి ఏడో తేదీ వరకూ ఆర్జిత సేవలను రద్దు చేశారు
తిరుమల తిరుపతి దేవస్థానంలో వచ్చే నెల మూడో తేదీ నుంచి ఏడో తేదీ వరకూ ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఈ ఐదు రోజుల పాటు ఆర్జిత సేవలు ఉండవని టీటీడీ తెలిపింది. శ్రీవారి తెప్పోత్సవాలు మార్చి 3నుంచి ఏడో తేదీ వరకూ జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. 3,4 తేదీల్లో సహస్ర దీపాలంకార సేవ, 5,6 తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం,తోమాల అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు.
విశేష ఉత్సవాలు....
మార్చి ఏడో తేదీన ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకర సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. మార్చి 3వ తేదీన కులశేఖరాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, ఏడో తేదీన కుమారధార తీర్థముక్కోటి, 18న అన్నామాచార్య వర్ధంతి, 22న ఉగాది సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆస్థానం, 30న శ్రీరామ నవమి ఆస్థానం, 31వ తేదీన శ్రీరామ పట్టాభిషేక ఆస్థానం జరగనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.