Andhra Pradesh : మార్చండి.. మార్చండి.. మిమ్మల్ని మార్చేస్తారు భయ్యా?

వైఎఎస్ జగన్ చేసిన పొరపాట్లనే కూటమి ప్రభుత్వం కూడా చేయడం మొదలుపెట్టినట్లుంది.

Update: 2024-10-05 05:30 GMT

chandrababu

వైఎఎస్ జగన్ చేసిన పొరపాట్లనే కూటమి ప్రభుత్వం కూడా చేయడం మొదలుపెట్టినట్లుంది. జగన్ ఓటమికి టీడీపీ నాడు తీసుకున్న నిర్ణయాలను మార్చడంతో పాటు పేర్లను కూడా మార్చేయడం కొంత జనంలో అసంతృప్తికి కారణమయింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చి తన తండ్రి వైఎస్సార్ పేరును పెట్టడం తీవ్ర వివాదాస్పదమయింది. ఎన్టీఆర్ హయాంలోనే హెల్త్ యూనివర్సిటీ ఆలోచనలకు బీజం పడింది. అందుకే ఆయన పేరు పెట్టడం సముచితం. ఎవరికైనా ఈ విషయం అవగతమవుతుంది. కానీ జగన్ అధికార దర్పంతో వైఎస్సార్ డాక్టర్ కాబట్టి పేరును మారుస్తున్నట్లు ప్రకటించినా ప్రజలను ఆయన చేసిన పనిని ఆమోదించలేదు.

ఎన్టీఆర్ పేరును మార్చడంతో....
ఎన్టీఆర్ మహోన్నతమైన వ్యక్తి. ఆయన సినిమాల్లో సంపాదించుకున్న ఆస్తులున్నప్పటికీ ఆయన ప్రజాసేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ అమలవుతున్నాయి, రెండు రూపాయల కిలో బియ్యం, మండల వ్యవస్థ ఏర్పాటు, గ్రామాల్లో పటేల్, పట్వారీ, మునసబు, కరణం వంటి వ్యవస్థలను తొలగించడం వంటివి ప్రజలను మరింత దగ్గర చేర్చాయి. అలాంటి ఎన్టీఆర్ పేరును హెల్త్ యూనివర్సిటీకి తొలగించి ఒక జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా పేరుపెడితే జనం ఎందుకు హర్షిస్తారు. అందుకే మొన్నటి ఎన్నికల్లో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. జీరో రిజల్ట్ వచ్చింది. పేరు బలం ఏంటో జగన్ కు ఫలితాలు చూసిన తర్వాత తెలిసొచ్చినట్లుంది.
మేకపాటి గౌతమ్ రెడ్డి పేరును తొలగించి...
కూటమి ప్రభుత్వం కూడా ఇప్పుడు అదే మార్గంలో పయనిస్తున్నట్లు కనిపిస్తుంది. మొన్నామధ్య మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరును సంగం బ్యారేజీకి గత వైసీపీ ప్రభుత్వం పెట్టింది. అయితే మొన్నా మధ్య ఆపేరును తొలగించడం కూడా వివాదంగా మారింది. మేకపాటి గౌతమ్ రెెడ్డి సౌమ్యుడు. చిన్న వయసులో మరణించడం కూడా ఎందరినో కలచి వేసింది. అలాంటి ఆయన పేరును తొలగించడంపై సింహపురి ప్రజలలో కొంత అసంతృప్తి అయితే కనపడుతుంది. మేకపాటి పేరును మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్నలు ప్రజల నుంచే వినపడుతున్నాయి. అందులో మరణించిన వారి పేరును తొలగించడం ఎంత వరకూ సబబన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది.
వైఎస్సార్ పేరును...
మరో వైపు తాజాగా కూటమి ప్రభుత్వంలోని మంత్రి సత్యకుమార్ యాదవ్ కడప జిల్లాకు పేరు వైఎస్సార్ పేరును తొలగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం అందుతుంది. వైెఎస్ పేరును తొలగించి కడప జిల్లాగా మార్చాలన్నది మంత్రిగారి ప్రతిపాదన. అయితే చంద్రబాబు వైఎస్సార్ కడప జిల్లా పేరు మార్పిడిపై ఎలాంటి నిర్ణయం ఇప్పటి వరకూ తీసుకోలేదు. వైఎస్సార్ ది కూడా ఎన్టీఆర్ లాగే సొంత జిల్లా అయిన కడప కావడంతో అక్కడ తీవ్రస్థాయిలో జనంలో అసంతృప్తి ఖచ్చితంగా తలెత్తుంది. వైఎస్సార్ కూడా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి జనం గుండెల్లో నిలిచిపోయిన నేతగా నిలిచారు. చంద్రబాబు ఈ ప్రతిపాదనకు అంగీకరించి వైఎస్సార్ పేరును కడప జిల్లాగా మారిస్తే రానున్న కాలంలో కేవలం కడప మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా భారీ మూల్యం చెల్లించుకునే అవకాశాలయితే పుష్కలంగా ఉన్నాయి. మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News