ఉదయభాను అనుచరుల ఆందోళన.. బందర్ రోడ్డులో ఉద్రిక్త పరిస్థితి
తాజాగా జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో.. ఆయన అనుచరులు, మద్దతుదారులు
విజయవాడ : ఏపీ కొత్తమంత్రి వర్గ విస్తరణ వైసీపీలో అంసతృప్తులకు దారితీసింది. నిన్నటి నుంచి వైసీపీ ఎమ్మెల్యేల నుంచి అసంతృప్తులు మొదలయ్యాయి. మంత్రి పదవులు ఆశించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బాలినేని శ్రీనివాస్, కోటంరెడ్డి శ్రీధర్.. ఇలా పలువురు ఎమ్మెల్యేలకు తీవ్ర నిరాశే ఎదురైంది. దాంతో ఎమ్మెల్యేల అనుచరులు ఆందోళనలకు దిగుతున్నారు. నిన్న రెంట చింతలలో పిన్నెల్లి అనుచరులు, మద్దతుదారులు ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే.
తాజాగా జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో.. ఆయన అనుచరులు, మద్దతుదారులు రోడ్డెక్కారు. తీవ్ర అసహనంతో విజయవాడ - బందర్ రోడ్డులో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. రోడ్లపై టైర్లు తగలబెట్టగా.. పోలీసులు ఆ మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. బందర్ రోడ్డులో పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో.. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేయగా.. ఎంతకీ వినకపోవడంతో అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.