Pawan Kalyan : పవన్ కల్యాణ్ పై ఎన్నో ఆశలు.. మరి పవన్ రాజీపడతారా? సాధిస్తారా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందు పెద్దటాస్క్ ఉంది. ఆయన నిర్ణయం కోసం ఎంతో మంది జనసేన నేతలు ఎదురు చూస్తున్నారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందు పెద్దటాస్క్ ఉంది. ఆయన నిర్ణయం కోసం ఎంతో మంది జనసేన నేతలు ఎదురు చూస్తున్నారు. గత ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంలో పవన్ కల్యాణ్ పాత్రను ఎవరూ కాదనలేరు. పవన్ లేకుంటే కూటమి ఏర్పాటు సాధ్యమయ్యేది కాదు. అలా అని పవన్ కల్యాణ్ తొలి నుంచి చెబుతున్నట్లుగానే ఒక వ్యూహం ప్రకారం గత ఎన్నికల సమయంలో ముందుకు వెళ్లారు. కూటమి ఏర్పాటుతో పాటు ఇబ్బందులు లేకుండా సీట్ల పంపిణీలో కూడా ఆయన కీలక భూమిక వహించారు. జగన్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా ఒకింత తగ్గడం మంచిదని ఆయన నిర్ణయించుకుని 21 అసెంబ్లీ స్థానాల్లోనే పోటీ చేశారు.
పర్సెంట్ స్ట్రయిక్ రేటు...
దీంతో మొన్నటి ఎన్నికల్లో జనసేనకు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రయిక్ రేటు వచ్చింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ జనసేన అభ్యర్థులు గెలిచారు. అంటే పవన్ ఆలోచన మేరకు తీసుకున్న నియోజకవర్గాల్లో ఇటు టీడీపీ, అటు జనసేన, బీజేపీ క్యాడర్ కూడా పనిచేశాయి. అదే సమయంలో టీడీపీ, బీజేపీ పోటీ చేసిన నియోజకవర్గాల్లోనూ జనసేన కార్యకర్తలు ఎన్నిక తమది అని భావించి పోలింగ్ కు సహకరించారు. ఓట్ల బదిలీ జరుగుతుందా? లేదా? అన్న అనుమానాలకు గత ఎన్నికల ఫలితాలు తేల్చి చెప్పాయి. ఎందుకంటే టీడీపీకి ఎన్నడూ రాని విధంగా అత్యధిక స్థానాలను గెలుచుకోవడమే ఇందుకు కారణం.
ఓట్ల బదిలీ...
కులాలు, అభిమానులు అందరూ గంపగుత్తగా టీడీపీకి ఓటు వేశారు. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబును, మోదీని కాపు సామాజికవర్గం ప్రజలు, పవన్ అభిమానులు చూడలేదు. కేవలం పవన్ కల్యాణ్ ను మాత్రమే చూసి ఓటు వేశారు. అయితే ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీ జరుగుతుంది. ఇప్పటికే దీనిపై పవన్ కల్యాణ్ చంద్రబాబుతో చర్చించారు. నామినేటెడ్ పోస్టుల విషయంలో జనసేన నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో టిక్కెట్ దక్కని వారితో పాటు పార్టీ కోసం కష్టపడిన వారు తమకు ఏదో ఒక పదవిని పవన్ ఇస్తారన్న నమ్మకంతో ఉన్నారు. ఆ దిశగా అనేక మంది ఇప్పటికే పార్టీ నేతలకు తమ అభిప్రాయాలను చెప్పినట్లు తెలిసింది.
బాబు నిర్ణయం...
కానీ నామినేటెడ్ పోస్టుల్లో 65 శాతం టీడీపీ తీసుకోవాలనుకుంటుందని సమాచారం. 25 శాతం పోస్టులు జనసేనకు ఇవ్వాలని భావిస్తుంది. పది శాతం పదవులను బీజేపీకి ఇవ్వాలన్న నిర్ణయానికి చంద్రబాబు దాదాపుగా వచ్చినట్లు పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు తెలుస్తోంది. టీడీపీలో ఆశావహులు ఎక్కువగా ఉండటంతో సహజంగా ఆ పార్టీ ఎక్కువ పదవులు తీసుకునే అవకాశముంది. అయితే జనసేన నేతలు మాత్రం ఎన్నో ఆశలు పెట్టుకున్నా నామినేటెడ్ పదవుల విషయంలో పవన్ కల్యాణ్ రాజీ పడతారా? లేక చంద్రబాబును ఒప్పించి ఎన్నికల్లో కష్టపడ్డ నేతలను మంచి, కీలకమైన పోస్టులను తెచ్చుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది.