Nagababu : ఆ ఒక్కటీ నాగబాబు కోసమేనా? అందుకే ఇన్నాళ్లు ఆపి ఉంచారా?

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు త్వరలో చేరనున్నారు

Update: 2024-12-10 05:45 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు త్వరలో చేరనున్నారు. ఈ విషయం టీడీపీ అధినేత, చంద్రబాబు నాయుడు స్వయంగా వెల్లడించారు. పవన్ కల్యాణ్ విజ్ఞప్తి మేరకు మంత్రివర్గంలోకి నాగబాబును తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. నాగబాబు మంత్రివర్గంలోకి రావడం ఎప్పుడో ఖాయమయింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ తో పాటు 24 మంది ఈ ఏడాది జూన్ 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆరోజే నాగబాబు కోసం ఒక మంత్రి పదవి రిజర్వ్ అయిందన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. కాకుంటే ఇన్నాళ్లు వెయిట్ చేసి ఇప్పుడు ఆ విషయాన్ని వెల్లడించారు.

టీడీపీ కోసమేనంటూ...
నాడు ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంచడంతో ఎవరి కోసమో? అన్న చర్చ అప్పట్లో జరిగింది. టీడీపీలో కొందరు టిక్కెట్ రాని వారికోసమో, లేక సీనియర్ల కోసమోనని భావించారు. చంద్రబాబు అందుకే ఒక మంత్రి పదవిని ఖాళీగా ఉంచారని ప్రచారం జరిగింది. కానీ టీడీపీ నేతల అంచనాలు తలకిందులయ్యాయి. అది జనసేనకు నాడే ఓకే అయింది. నాడు జనసేనకు మూడు మంత్రిపదవులు, బీజేపీకి ఒక మంత్రి పదవి మంత్రివర్గంలో చోటు కల్పించారు. పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ మంత్రిగా, టూరిజం అండ్ ఫిలిం డెవలెప్ మెంట్ శాఖను కందుల దుర్గేష్ కు ఇచ్చారు. కొణతాల రామకృష్ణ, మండలి బుద్ధప్రసాద్ వంటి సీనియర్ నేతలున్నా వారి పేర్లను పక్కన పెట్టారు.
అనేక ప్రచారాలు...
ఈ పరిస్థితుల్లో నాగబాబుకు పదవి విషయంపై అనేక ప్రచారాలు జరిగాయి. తొలుత తిరుపతి తిరుమల దేవస్థానం ఛైర్మన్ అని అన్నారు. తర్వాత రాజ్యసభకు ఎంపిక చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఎప్పుడో డిసైడ్ అయినట్లుగానే నాగబాబుకు మంత్రిపదవి దక్కనుంది. త్వరలోనే నాగబాబు చంద్రబాబు కేబినెట్ లో చేరనున్నారు. త్వరలోనే ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ పదవికి ఆయన ఎంపిక చేయనున్నారు. ఆరు నెలల్లోపు చట్టసభలకు ఎంపిక కావాల్సి ఉండగా, అందుకోసమే ఇప్పుడు నాగబాబు పేరును ప్రకటించినట్లు అర్థమవుతుంది. ఐదు నెలల్లో ఐదు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవుతున్నాయి. ఆ పోస్టులన్నీ కూటమి పార్టీలకే దక్కనున్నాయి. అందులో ఒకటి నాగబాబుకు కేటాయించనున్నారు. అందుకే ఇప్పుడు పవన్ సోదరుడు నాగబాబు కోసం ఆరు నెలల పాటు పవన్ కల్యాణ్ వెయిట్ చేసి మరీ ఇప్పుడు మంత్రి పదవిని అప్పగిస్తున్నారు.
అందుకే వదులుకున్నారా?
నిజానికి రాజ్యసభ విషయంలో బీజేపీకి ఒకటి దక్కకూడదు. అది జనసేన ఖాతాలోనే పడాల్సి ఉంది. ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాల్లో రెండు టీడీపీకి, ఒకటి జనసేనకు అని భావించారు. కానీ నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని భావించడం వల్ల ఆ ఒక్క స్థానాన్ని కూటమిలోని మిత్రపక్షమైన బీజేపీకి కేటాయించారంటున్నారు. మొత్తం మీద నాగబాబు పేరు ఎప్పుడో మంత్రివర్గంలో ఖరరాయిందని, అందుకు సమయం కోసం వేచి చూస్తూ ఇప్పుడు బయటపెట్టారని టీడీపీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. రానున్న ఎమ్మెల్సీ పదవి కూడా నాగబాబుకు రిజర్వ్ అయినట్లు ఈ ఎంపిక తో తేటతెల్లమయింది. ఇక త్వరలో మినిస్టర్ నాగబాబుగా మారబోతున్నారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App Now

Tags:    

Similar News