"సీఎం జగన్ వస్తున్నాడు మీ కార్లు జాగ్రత్త" - వినూత్న ప్రచారం!

ఆదివారం నగర వీధుల్లో జనసేన నేతలు, కార్యకర్తలు ఈ మేరకు ప్రచారం చేశారు. ఇందుకు కారణం లేకపోలేదు. ఇటీవల ఒంగోలులో..

Update: 2022-05-01 12:24 GMT

తిరుపతి : సీఎం జగన్ వస్తున్నాడు.. మీ కార్లు జాగ్రత్త అంటూ జనసేన పార్టీ తిరుపతిలో వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఆదివారం నగర వీధుల్లో జనసేన నేతలు, కార్యకర్తలు ఈ మేరకు ప్రచారం చేశారు. ఇందుకు కారణం లేకపోలేదు. ఇటీవల ఒంగోలులో తిరుపతి వెళ్తున్న భక్తుల నుంచి.. సీఎం జగన్ కాన్వాయ్ కి కారు అవసరమైందంటూ వారి కారును తీసేసుకున్నారు పోలీసులు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. చిన్న పిల్లలున్నారు.. ఇబ్బంది అవుతుందని ఎంత చెప్పినా వినకుండా నడిరోడ్డుపై కుటుంబాన్ని దింపేసి కారును తీసుకెళ్లారు.

దానిపై రాష్ట్ర రాజకీయ విపక్షాలు జగన్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశాయి. మే 5న సీఎం జగన్ తిరుపతిలో పర్యటించనున్న నేపథ్యంలో జనసేన ఇలా వినూత్నంగా ప్రచారం చేపట్టింది. టిటిడి నిర్మిస్తున్న చిన్న పిల్లల మల్టీస్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థాపన చేసేందుకు జగన్ తిరుపతికి వెళ్లనున్నారు. సీఎం జగన్ తిరుపతి వస్తున్నాడని, స్థానిక ప్రజలు, తిరుమలకు వచ్చే యాత్రికులు కార్లు జాగ్రత్తగా ఉంచుకోవాలని హెచ్చరిస్తూ దండోరా వేశారు. జనసేన పార్టీ తిరుపతి ఇన్చార్జి కిరణ్ రాయల్ నేతృత్వంలో ఈ దండోరా కార్యక్రమం నిర్వహించారు. వీలైతే ఆ రోజు కార్లన్నీ ఇంట్లోనే ఉంచి.. బస్సుల్లో ప్రయాణించాలని చాటింపు వేశారు. ఈ దండోరా వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.








Tags:    

Similar News