చంద్రబాబు నాయుడుకు సంపూర్ణ మద్దతు: పవన్ కళ్యాణ్

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖండించారు

Update: 2023-09-09 06:47 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖండించారు. ప్రాథమిక ఆధారాలు చూపకుండా చంద్రబాబు నాయుడిని అర్థరాత్రి అరెస్టు చేశారని పవన్ కళ్యాణ్ అన్నారు. 2022 అక్టోబర్‌లో వైజాగ్ లో తమ పట్ల కూడా అలాగే ప్రవర్తించారనీ, ఏ తప్పూ చెయ్యని తమ కార్యకర్తల్ని అరెస్టు చేశారని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది అన్నారు. లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చెయ్యాల్సింది పోలీసులైతే.. వైసీపీ వాళ్లు ఎందుకు రోడ్లపైకి వస్తున్నారని పవన్ ప్రశ్నించారు. వైసీపీ నేతలైతే విదేశాలకు కూడా వెళ్లవచ్చనీ, అదే టీడీపీ నేతను అరెస్టు చేస్తే, కనీసం ఆ పార్టీ కార్యకర్తలు కూడా ఇళ్ల నుంచి బయటకు రాకూడదా అని పవన్ ప్రశ్నించారు. చంద్రబాబుకి తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని పవన్ తెలిపారు. దీని నుంచి చంద్రబాబు త్వరగా బయటపడాలని కోరుకుంటున్నట్లు పవన్ తెలిపారు. జనసేన నుండి చంద్రబాబు నాయుడుకు సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.

టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడంపై విపక్ష పార్టీల నేతలు స్పందిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం, పోలీసుల తీరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి పూట వచ్చి హంగామా చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఏదైనా ఉంటే ముందుగానే నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాల్సిందని అన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇది కాదని చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ దుర్మార్గమని అన్నారు. తన తండ్రి వద్దకు వెళ్లకుండా నారా లోకేశ్ ను పోలీసులు అడ్డుకోవడం కూడా దారుణమని అన్నారు.


Tags:    

Similar News