అప్పటి నుండే వారాహి నాలుగో విడత యాత్ర
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి విజయయాత్ర అక్టోబర్ 1
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి విజయయాత్ర అక్టోబర్ 1 తేదీ నుంచి ప్రారంభం కానుంది. కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఈ మేరకు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటన విడుదల చేశారు. పవన్ తదుపరి విడత వారాహి విజయయాత్ర షెడ్యూల్ ఖరారైందని.. సన్నద్ధమవ్వాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ యాత్రకు సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లా ముఖ్య నాయకులతో నాదెండ్ల టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అవనిగడ్డలో మొదలయ్యే ఈ యాత్ర మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల మీదుగా సాగనుంది. టీడీపీ, జనసేనల పొత్తు ప్రకటన తర్వాత పవన్ జనాల్లోకి వెళ్లడం ఇదే తొలిసారి. దీంతో పవన్ వారాహి యాత్రపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
"జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన 'వారాహి విజయ యాత్ర' నాలుగో విడత కార్యక్రమానికి షెడ్యూల్ ఖరారైంది. కృష్ణా జిల్లాలో ఈ యాత్ర నిర్వహిస్తారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి అవనిగడ్డలో వారాహి విజయ యాత్ర మొదలవుతుంది. ఈ మేరకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు సోమవారం మధ్యాహ్నం ఉమ్మడి కృష్ణా జిల్లా ముఖ్య నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అవనిగడ్డ నియోజకవర్గంలో మొదలయ్యే ఈ యాత్ర మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల మీదుగా సాగేలా ప్రణాళిక సిద్ధమైంది." అంటూ జనసేన ప్రకటన వచ్చింది.